అమీర్‌పేట్: బేగంపేట్‌లోని దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ సహకారంతో అంధులకు ఫిడే రేటింగ్ జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. బేగంపేట్‌లోని దేవనార్ అంధుల పాఠశాలలో రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో పాల్గొనేందుకు దేశంలోని 16 రాష్ర్టాల నుంచి 250 మంది ప్లేయర్లు తరలివచ్చారని నిర్వాహకులు దేవనార్ ‘ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్’ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ సాయిబాబాగౌడ్ తెలిపారు.
ఈ పోటీల్లో 6 నుంచి 76 ఏండ్ల వయసున్న ప్లేయర్లు పాల్గొంటున్నారని తెలిపారు. ఇంత పెద్దసంఖ్యలో క్రీడాకారులు ఏక కాలంలో చెస్ ఆడడం దేశంలో ఇదే మొదటిసారని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన క్రీడాకారులకు గురువారం ట్రోఫీలతో పాటు నగదు బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు.