దుబాయ్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరు క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది. చాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల పోరు కొత్త రికార్డులకు వేదికైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను టెలివిజన్లలో ఏకంగా 20.6 కోట్ల మంది వీక్షించారట. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) చరిత్రలో అత్యధిక మంది చూసిన రెండో మ్యాచ్‌గా ఇది రికార్డుల్లోకెక్కింది.
2023లో అహ్మదాబాద్‌లో జరిగిన భారత్, పాక్ మ్యాచ్ కంటే 11శాతం ఎక్కువ చాంపియన్స్ ట్రోఫీ పోరును చూసినట్లు అధికారిక ప్రసారదారు జియో హాట్‌స్టార్ పేర్కొంది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ విజయదుందుభి మోగించింది. స్టార్ బ్యాటర్ విరాట్‌కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగిన వేళ టీమ్ఇండియా చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.