ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. ఇరు దేశాల నడుమ కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మైనార్టీ హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్న బంగ్లాదేశ్ వైఖరిని నిరసిస్తూ ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజర్ రెహమాన్‌ను బీసీసీఐ తొలిగించడం ఆ తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) నిర్ణయాలు వివాదాన్ని మరింత రాజేస్తున్నాయి. తమ దేశ క్రికెటర్‌ను ఐపీఎల్ నుంచి తీసివేయడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్న బంగ్లాదేశ్ ఇప్పటికే భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడేది లేదంటూ ప్రకటన జారీ చేయగా, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తున్నట్లు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మంత్వ్రిత్వ శాఖ సహాయక కార్యదర్శి ఫిరోజ్‌ఖాన్ ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తీసివేయడంపై బీసీసీఐ సరైన కారణం చెప్పలేదు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లా ప్రజలను బాధించింది. మా దేశ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఐపీఎల్ ప్రసారాలపై బ్యాన్ కొనసాగుతుంది’ అని బంగ్లా ప్రభుత్వం పేర్కొంది.
ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ విధించిన నిషేధంతో బీసీసీఐకి వచ్చిన నష్టమేమి లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్‌గా వెలుగొందుతున్న ఐపీఎల్‌కు విపరీతమైన ప్రజాదరణ ఉంది. బంగ్లా లాంటి దేశాలు బహిష్కరించినా బీసీసీఐకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మార్చి 26 నుంచి మొదలయ్యే ఐపీఎల్ సీజన్లో దాదాపు అన్ని దేశాల క్రికెటర్లు ఆయా ఫ్రాంచైజీల తరఫున బరిలోకి దిగుతున్నారు. ముస్తాఫిజుర్‌ను తప్పించడంతో ఐపీఎల్లో బంగ్లా ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీన్ని మనసులో పెట్టుకుని ఇప్పటికే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు మేము భారత్‌లో ఆడమమని శ్రీలంకకు మార్చాలంటూ బీసీబీ..ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే మరో నెల రోజుల వ్యవధిలో మొదలుకానున్న మెగాటోర్నీ కోసం ఇప్పటికే అధికారిక షెడ్యూల్ ఖరారు కాగా, బంగ్లా తాజా వైఖరిపై ఐసీసీ ఎలా స్పందిస్తునది ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లా జట్టు కోల్‌కతాలో మూడు మ్యాచ్‌లు, ముంబైలో ఒక లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడాల వద్దా అనే దానిపై ఐసీసీ తీసుకునే నిర్ణయంపై తమ తదుపరి ఆలోచన ఉంటుందని బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం పేర్కొన్నాడు. భారత్‌లో బంగ్లా క్రికెటర్లకు సరైన భద్రత ఉండదన్న కారణంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. సోమవారం అమినుల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ‘భారత్‌లో తమ జాతీయ జట్టుకు సరైన భద్రత లేదని భావిస్తున్నాం. క్రికెట్ బోర్డు డైరెక్టర్లతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం.
దీనిపై ఐసీసీ ప్రతిస్పందన బట్టి మేము ఏం చేయాలనేది ఆలోచిస్తాం’అని అన్నాడు. మెగాటోర్నీలో ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించి ఆయా దేశాల క్రికెటర్లకు వసతి, రవాణా సౌకర్యాలు ఖరారైన నేపథ్యంలో బీసీబీ ప్రతిపాదన పట్ల ఐసీసీ నిర్ణయంపై అంతటా ఆసక్తి నెలకొన్నది. బీసీబీ ప్రతిపాదనకు తలొగ్గుతుందా లేక..షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిందేనంటూ అల్టిమేటం ఇస్తుందా అనేది త్వరలో తేలనుంది.