మడ్గావ్ (గోవా): ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగే సూపర్ కప్ టైటిల్‌ను ఎఫ్‌సీ గోవా కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో గోవా.. ఈస్ట్ బెంగాల్‌ను ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో మొదట నిర్ణీత సమయంలో ఇరుజట్లూ ఒక్క గోల్ చేయకపోవడంతో ఆటను మరో 30 నిమిషాలకు పెంచారు.
ఎక్స్ట్రా టైమ్‌లోనూ అదే పరిస్థితి రావడంతో పోరు కాస్తా టైబ్రేక్‌కు దారితీసింది. పెనాల్టీ షూటౌట్లో అయినా ఫలితం తేలుతుందనుకుంటే ఇరుజట్లు 4-4తో సమంగా నిలవడంతో సడెన్ డెత్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. సడెన్ డెత్‌లో గోవా.. 6-5తో మూడో సూపర్ కప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది.