న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మార్పులకు శ్రీకారం చుట్టింది. రానున్న దేశవాళీ క్రికెట్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యంగా ప్లేయర్ల గాయాలు, షార్ట్ రన్, రిటైర్డ్ ఔట్లపై స్పష్టమైన గైడ్‌లైన్స్‌ను శనివారం విడుదల చేసింది. ఇటీవల అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్, ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తీవ్ర గాయాల నేపథ్యంలో బోర్డు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ‘సీరియస్ ఇంజ్యూరీ రిప్లేస్మెంట్’ పేరిట తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా ప్లేయర్ తీవ్రంగా గాయపడితే ఆ స్థానాన్ని వేరే ప్లేయర్‌తో భర్తీ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకొచ్చింది.
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న అంపైర్ల సెమినార్లో తాజాగా తీసుకొచ్చిన నిబంధనలను బోర్డు వివరించింది. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, విజయ్ హజారే వన్డే టోర్నీల్లో కాకుండా రెండు, మూడు రోజులు జరిగే టోర్నీల్లో ఈ నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. దీనికి తోడు రానున్న ఐపీఎల్ సీజన్లో ఈ నిబంధనలను అమలు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈనెల 28 నుంచి దులీప్ ట్రోఫీతో దేశవాళీ సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో కొత్త గైడ్‌లైన్స్ సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
బీసీసీఐ కొత్తగా తీసుకొచ్చిన ‘సీరియస్ ఇంజ్యురీ రిప్లేస్మెంట్’ నిబంధన ప్రకారం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు జరిగే మ్యాచ్‌లకే వర్తిస్తుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్లేయర్ మైదానంలోనే గాయపడాలి. ఎముక విరుగడం, తీవ్రంగా బెణకడం, బోన్ డిస్లొకేషన్ లాంటి గాయం తీవ్రత పైనే ప్లేయర్ మార్పు అనేది ఆధారపడి ఉంటుంది. సదరు ప్లేయర్‌కు అయిన గాయంతో అతను తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా ఉంటేనే ఆ స్థానంలో వేరే ప్లేయర్‌ను అనుమతిస్తారు. గాయపడ్డిన ప్లేయర్ స్థానంలో సరిగా అదే స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్‌ను తీసుకొవచ్చు. రిప్లేస్మెంట్ కోసం జట్టు మేనేజర్..అంపైర్‌కు లేదా మ్యాచ్ రిఫరీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైద్యుల సూచనలు అనుసరించి రిఫరీ నిర్ణయం తీసుకుంటాడు. రిప్లేస్మెంట్ వచ్చే ప్లేయర్ టాస్ వేసే సమయంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల జాబితా నుంచి మాత్రమే ఉండాలి. ఒకవేళ వికెట్‌కీపర్ గాయపడితే మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది.
బీసీసీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాటర్ గాయం లేదా అనారోగ్య కారణాలతో కాకుండా వేరే విధంగా రిటైర్ అయితే ఇప్పటి నుంచి దాన్ని ఔట్‌గా పరిగణిస్తారు. సదరు బ్యాటర్‌కు తిరిగి బ్యాటింగ్ చేసే అవకాశమివ్వరు. ఈ నిబంధన వల్ల మ్యాచ్ మధ్యలో రిటైర్ కావడం వలన ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టే దానికి దీంతో ఫుల్స్టాప్ పడనుంది.
మ్యాచ్‌లో బ్యాటర్ పరుగు తీసే క్రమంలో ఉద్దేశపూర్వకంగా క్రీజును సరిగ్గా తాకకుండా పరుగు తీస్తే దాన్ని ఇప్పటి నుంచి పరిగణనలోకి తీసుకోరు. కొత్త నిబంధన ప్రకారం బ్యాటర్ చీటింగ్ చేసినట్లు భావిస్తే..ఫీల్డింగ్ టీమ్ కెప్టెన్ చెప్పిన దాన్ని అనుసరించి తర్వాత బంతికి స్ట్రయిక్ మారాల్సి ఉంటుంది. మరోవైపు ఒక వేళ బ్యాటర్ పరుగు మధ్యలోనే ఆపేస్తే అది ఉద్దేశపూర్వక తప్పిదం కాదని భావిస్తే..ఈ నిబంధన వర్తించదు.