NCA | బెంగళూరు: ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బెంగళూరులోని తమ కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)ను ఆదివారం అట్టహాసంగా ప్రారంభించింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా దీనిని అధికారంగా ప్రారంభించారు. కొత్త ఎన్సీఏకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)గా పేరుపెట్టింది. ప్రపంచ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక సౌకర్యాలతో సీవోఈను ఏర్పాటుచేసినట్టు బీసీసీఐ తెలిపింది.
ప్రస్తుతమున్న ఎన్సీఏను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి సమీపాన ఉన్న ప్రదేశంలో నిర్వహిస్తుండగా.. తాజాగా ప్రారంభించిన సీవోఈను కెంపెగౌడ విమానాశ్రయం సమీపంలో సుమారు 40 ఎకరాల విశాల ప్రాంగణంలో నిర్మించారు.కొత్తగా ప్రారంభించిన సీవోఈకి హెడ్‌గా వ్యవహరిస్తున్న హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ ఇక్కడి వసతులు భారత ఔత్సాహిక క్రికెటర్లకు ఓ వరమని అభివర్ణించాడు.
సీవోఈలో మూడు ప్రపంచ స్థాయి గ్రౌండ్లు, 86 ప్రాక్టీస్ పిచ్‌లు (ఇండోర్ 41, ఔట్‌డోర్ 45), అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రిహాబిటేషన్ సెంటర్, అండర్‌వాటర్ పూల్ స్పా, సకల సౌకర్యాలు కలిగిన జిమ్, ఒలింపిక్ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ పూల్, ఆరు ఔట్‌డోర్ రన్నింగ్ ట్రాక్‌లు వంటి ఎన్నో వసతులున్నాయి. మూడు ప్రధాన గ్రౌండ్లలో ఒకదానిని ముంబైలోని ఎర్రమట్టితో నిర్మించగా మిగతా వాటిని మాండ్య (కర్నాటక), కలహండి (ఒడిషా)లోని నల్లమట్టితో తయారుచేశారు. మెయిన్ గ్రౌండ్‌ను ఇంగ్లీష్ కౌంటీ గ్రౌండ్స్ తరహాలో రూపొందించారు. ఇక్కడ మ్యాచ్‌లను ఆడించేందుకు వీలుగా ఫ్లడ్‌లైట్లు, ఇతర వసతులూ కల్పించారు. యూకే, ఆస్ట్రేలియా నుంచి ప్రీమియం టర్ఫ్‌లతో 8 పిచ్‌లను తయారుచేశారు. సీవోఈని కేవలం క్రికెటర్లకే కాకుండా అథ్లెటిక్స్, ఇతర క్రీడల క్రీడాకారులూ ఉపయోగించుకునేలా తీర్చిదిద్దారు.
బీసీసీఐ కార్యదర్శిగా త్వరలో ఆ పదవి నుంచి తప్పుకోనున్న జై షా వారసుడిని వీలైనంత త్వరగా గుర్తించాలని బోర్డు సభ్యులు అతడిని కోరినట్టు సమాచారం. బీసీసీఐ 93వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) సందర్భంగా ఈ అంశం చర్చలోకి వచ్చింది. జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సభ్యులు అభ్యర్థించినట్టు తెలుస్తోంది. ఈ పదవి రేసులో రోహన్ జైట్లీ (ఢిల్లీ), అషిష్ షెలార్ (ముంబై), దేవ్జిత్ సైకియా (గుజరాత్) రేసులో ఉన్నట్టు సమాచారం. ఇక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో జనరల్ బాడీ రిప్రజెంటేటివ్స్‌గా అర్జున్ సింగ్ ధుమాల్, అవిశేక్ దాల్మియా ఎంపికయ్యారు. ఆంధ్రా మాజీ క్రికెటర్ వి. చాముండేశ్వరినాథ్ ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) ప్లేయర్ రిప్రజెంటేటివ్‌గా నామినేట్ అయ్యారు.