ముంబై: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ఐఎస్పీఎల్) మూడో సీజన్ వేలం పాట ఆసక్తికరంగా సాగింది. రానున్న సీజన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు వేలంలో 144 మంది ప్లేయర్ల కోసం దాదాపు 10 కోట్లు ఖర్చు చేశాయి. మంగళవారం అర్ధరాత్రి ముగిసిన వేలంలో విజయ్ పావ్లెను మాజీ ముంబై అత్యధిక బిడ్డింగ్(రూ.32.50 లక్షలు)కు సొంతం చేసుకుంది. ఐఎస్పీఎల్లో ఇది కొత్త రికార్డుగా నమోదైంది. విజయ్ తర్వాత కేతన్మాత్రెను చెన్నై సింగమ్స్ టీమ్ 26.40 లక్షలకు రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంది.
లీగ్‌లో అతిపిన్న వయసు ప్లేయర్ రుద్ర పాటిల్(16 ఏండ్లు)ను శ్రీనగర్ కే వీర్ తమ జట్టులోకి తీసుకుంది. లీగ్‌లో మిగతా ఫ్రాంచైజీలతో పోల్చుకుంటే ఫాల్కన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ రూ.1.47 కోట్లు ప్లేయర్ల కోసం వేలంలో ఖర్చు పెట్టింది.
సూరత్‌లోని లాల్బాయ్ స్టేడియం వేదికగా జనవరి 9 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్న ఐఎస్పీఎల్ మూడో సీజన్లో ఈసారి రెండు కొత్త జట్లు అహ్మదాబాద్ లయన్స్, ఢిల్లీ సూపర్‌హీరోస్ బరిలోకి దిగుతున్నాయి. ఐఎస్పీఎల్ వేలంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు అశిష్ షెలార్, అక్షయ్‌కుమార్, సైఫ్అలీఖాన్, హృతిక్‌రోషన్, సల్మాన్‌ఖాన్, అజయ్ దేవ్‌గణ్ పాల్గొన్నారు.