బెంగళూరు: మరో మూడు రోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్-19వ సీజన్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుడు తొలిసారి ట్రోఫీ గెలిచిన ఆ జట్టు నిర్వహించిన విజయయాత్రలో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించగా.. రానున్న ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ (ఎస్ఆర్హెచ్తో)లో వారికి ఘననివాళి అర్పించనుంది. ఈ మేరకు ఆర్సీబీ సీఈవో రాజేశ్ మీనన్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ.. ‘మ్యాచ్ రోజు ఆటగాళ్లందరూ 11వ నెంబర్ జెర్సీని (ఇది మ్యాచ్ కోసం కాదు. నివాళి కార్యక్రమానికి మాత్రమే) ధరిస్తారు.
అంతేగాక ఆ 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను శాశ్వతంగా రిజర్వ్ చేయనున్నారు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకూ ఈ సీట్లను అమ్మకానికి పెట్టరు’ అని తెలిపాడు. కాగా స్టేడియం ప్రవేశద్వారం దగ్గర వారి గుర్తుగా ఒక స్మారక ఫలకాన్ని కూడా ఏర్పాటుచేయనున్నట్టు తెలుస్తున్నది. ఐపీఎల్-19లో ఆర్సీబీ.. ఐదు లీగ్ మ్యాచ్‌లను చిన్నస్వామిలో ఆడాల్సి ఉండగా మిగిలిన రెండింటినీ రాయ్‌పూర్‌లో ఆడుతుంది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ ఈ సీజన్లో ఆడబోడని ఆర్సీబీ క్లారిటీఇచ్చింది. ఈ మేరకు ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బొబాట్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్లో యశ్ జట్టుతో చేరడు. ప్రస్తుతం అతడు ఒక వ్యక్తిగత సమస్యతో సతమతమవుతున్నాడు. మేం అతడికి అండగా ఉన్నాం. అతడితో మా కాంట్రాక్టు కొనసాగుతుంది’ అని తెలిపాడు.