గత నెల 22న అట్టహాసంగా మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో ఒక అంకం ముగిసింది! రెండు నెలల పాటు 74 మ్యాచ్ (70 లీగ్, 4 నాకౌట్)లుగా సాగే ఈ ధనాధన్ క్రికెట్ సంరంభంలో ఏప్రిల్ 22న జరిగిన లక్నో X ఢిల్లీ పోరుతో 40 మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పటి దాకా జరిగిన మ్యాచ్‌లు ఒకెత్తు అయితే ఇక నుంచి ఆడబోయే ప్రతి పోరు అన్ని జట్లకూ అత్యంత కీలకం.
IPL | నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : లాస్ట్ ఓవర్ థ్రిల్లర్లు, హైస్కోరింగ్ ధనాధన్లు, అనామక ఆటగాళ్ల మెరుపులు, స్టార్ క్రికెటర్ల గ్రహపాటు, అగ్రశ్రేణి జట్ల తడబాటు.. వెరసి ఐపీఎల్-18 రసవత్తరంగా సాగుతున్నది. దేశంలోని 13 నగరాల్లో జరుగుతున్న ఈ క్యాష్ రిచ్ లీగ్.. గత నెల 22న మొదలై మంగళవారంతో నెల రోజులు పూర్తై 74 మ్యాచ్‌లలో 40 మ్యాచ్‌లు ముగిశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (7 మ్యాచ్‌లు) తప్ప అన్ని జట్లూ తలా 8 మ్యాచ్‌లు (లక్నో, ఢిల్లీ మ్యాచ్‌కు ముందు) ఆడేశాయి.
ఎవరూ ఊహించని రీతిలో ఇప్పటి దాకా ట్రోఫీని దక్కించుకోని ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లు పాయింట్ల పట్టికలో టాప్-5లో ఉంటూ ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకుపోతుంటే ఈ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జైట్టెన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఆడిన 8 మ్యాచ్‌లకు గాను రెండింట్లోనే గెలిచి ఆరు ఓడి అట్టడుగున నిలవగా గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్.. ఐదింట్లో ఓడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు జట్లతో పాటు ఐపీఎల్ తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ (6 ఓటములు) ప్లేఆఫ్స్ ఆశలు అటకెక్కినట్టే. సీజన్ ఆరంభంలో తడబడ్డా హ్యాట్రిక్ విజయాలతో కాస్త పుంజుకున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ దిశగా సాగుతున్నది.
ప్రతి సీజన్ మాదిరిగానే 2025లోనూ ఐపీఎల్‌కు కొత్త నీరు వరదలా వెల్లువెత్తుతున్నది. ప్రియాన్ష్ ఆర్య, దిగ్వేశ్ రాఠి, విప్రాజ్ నిగమ్, అనికేత్ వర్మ, విఘ్నేశ్ పుతుర్, అశ్వనీ కుమార్, షేక్ రషీద్ వంటి కుర్రాళ్లతో పాటు ఇంకా పాఠశాల వయసు కూడా దాటని 14 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ, 17 ఏండ్ల అయుశ్ మాత్రె.. అవకాశమిస్తే సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రపంచానికి చాటి చెప్పారు. పైన పేర్కొన్నవారికి దేశవాళీ ఆడిన అనుభవమూ లేదు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మెరిసిన ఆర్య, దిగ్వేశ్.. పంజాబ్, లక్నో విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుండగా ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటిన విప్రాజ్ ఢిల్లీకి కీ ప్లేయర్ అయ్యాడు. మధ్యప్రదేశ్ లీగ్‌లో రాణించిన అనికేత్ వర్మ.. సన్‌రైజర్స్ లోయరార్డర్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. కొత్త కుర్రాళ్లు సత్తా చాటుతున్న ఈ లీగ్‌లో లీగ్‌లో అత్యధిక ధర దక్కించుకున్న రిషభ్ పంత్‌తో పాటు, వెంకటేశ్ అయ్యర్, రషీద్ ఖాన్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అశ్విన్, జడేజా వంటి స్టార్ ప్లేయర్లు మాత్రం వైఫల్య ప్రదర్శనతో అభిమానులను విసిగిస్తున్నారు.
తొలి రెండు వారాలు భారీ స్కోర్లు నమోదైన ఈ సీజన్లో బౌలర్లకు పీడకలలే మిగిలాయి. కానీ తర్వాత పరిస్థితి కాస్త మారింది. బౌలర్లు కూడా సత్తా చాటుతూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజస్థాన్ ఓడిన చివరి రెండు మ్యాచ్‌లు (ఢిల్లీ, లక్నోతో) ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. బంతికి ఉమ్మి రాయొచ్చునని ఈ సీజన్‌కు ముందు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం.. ఈ సీజన్లో గేమ్ ఛేంజర్ అయింది. దీనిని ఉపయోగించుకుని స్టార్క్, సిరాజ్, భువనేశ్వర్, హాజిల్‌వుడ్, మోహిత్ శర్మ, అవేశ్ ఖాన్ వంటి పేసర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా వంటి నిర్జీవమైన పిచ్‌లను మినహాయిస్తే మిగిలిన వేదికల్లో పిచ్‌ల నుంచి బౌలర్లకు మంచి సహకారం అందుతున్నది.
సొంత వేదికల్లో ఘనమైన రికార్డులు కలిగిన కొన్ని జట్లకు ఈ సీజన్లో ఘోరపరాభవాలు తప్పడం లేదు. చెపాక్‌లో చెన్నైకి, చిన్నస్వామిలో బెంగళూరుకు, వాంఖడేలో ముంబైకి, ఈడెన్ గార్డెన్స్‌లో నైట్‌రైడర్స్‌కు భంగపాటు తప్పలేదు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి తాజా సీజన్ దాకా ఆర్సీబీ, ఢిల్లీ చేతిలో ఓడిపోని చెన్నైకి ఈ సీజన్లో ఓటములు ఎదురయ్యాయి. అభిమానుల మద్దతు నిండుగా ఉండే చిన్నస్వామిలో ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ బెంగళూరు బోణీ కొట్టలేదు. వాంఖడేలో దశాబ్దకాలంగా గెలుపెరగని రాయల్ చాలెంజర్స్.. ఈ సీజన్లో ఆ గోడను బద్దలుకొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన 4 మ్యాచ్‌లలో కోల్‌కతాకు 3 ఓటములే పలకరించాయి. స్లో టర్నర్‌గా పేరున్న లక్నో పిచ్‌పైనా ఆ జట్టు తడబడుతుండగా జైపూర్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్.. మూడింట్లోనూ ఓటములే మూటగట్టుకుంది.