హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిభ కల్గిన ప్లేయర్ల ఆకాంక్షను నెరవేర్చే విధంగా క్రీడలకు సముచిత కేటాయింపులు ఉన్నాయని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. వార్షిక బడ్జెట్లో భాగంగా క్రీడల కోసం ప్రభుత్వం రూ.134.80 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.53 కోట్లు అదనంగా కేటాయించారు. ఈ నేపథ్యంలో సాట్స్ చైర్మన్ మాట్లాడుతూ ‘బడ్జెట్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. 45 కోట్లతో ప్రాంగణాలను మరింత అభివృద్ధి చేసేందుకు కేటాయింపులు చేశారు. పల్లెప్రగతిలో భాగంగా ఇప్పటికే 12వేలకు పైగా గ్రామాల్లో ప్రాంగణాల నిర్మాణం పూర్తయ్యింది. భవిష్యత్లో గ్రామాల నుంచి మెరికల్లాంటి ప్లేయర్లను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఇది ఎంతగానో దోహదపడనుంది.
పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యాశాఖ ద్వారా క్రీడాభివృద్ధికి దోహదపడుతాం’ అని అన్నారు. మరోవైపు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలకు భిన్నంగా ఉందని ఆంజనేయగౌడ్ అన్నారు. ఖేలోఇండియా పథకానికి వెయ్యికోట్లు కేటాయించి చేతులు దులుపుకోవడం క్రీడా, యువజన సంక్షేమ రంగాన్ని పూర్తిగా విస్మరించడమేనని ఆయన దుయ్యబట్టారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లేదంటూ విమర్శించారు. సమగ్రమైన జాతీయ క్రీడా విధానం లేకపోవడం వల్ల గ్రామీణ యువతకు మేలు చేకూరడం లేదని అన్నారు.