ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్‌లో గులాబీ పోరు రసవత్తరంగా సాగుతున్నది. పెర్త్ టెస్టు విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన భారత్‌కు అడిలైడ్‌లో మెరుగైన శుభారంభం దక్కలేదు. ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్ల విజృంభణతో టీమ్ఇండియా 180 పరుగులకే పరిమితమైంది. సహచర క్రికెటర్లు అంతగా ఆకట్టుకోలేకపోయిన వేళ తెలుగు క్రికెటర్ నితీశ్కమార్రెడ్డి తెగువ చూపించాడు. కంగారూ బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొంటూ కీలకమైన పరుగులు జత చేశాడు. టీమ్ఇండియాను స్వల్ప స్కోరుకు పరిమితం చేసిన ఆసీస్..వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. రెండో రోజు తొలి సెషన్ ఇరు జట్లకు కీలకం కానుంది.
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం మొదలైన అడిలైడ్ టెస్టు ఆసక్తికరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. పెర్త్ టెస్టు సెంచరీ హీరో యశస్వి జైస్వాల్(0) సున్నాకే పరిమితం కాగా, కేఎల్ రాహుల్(37) ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్లో కెప్టెన్ రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ నిరాశపరిచారు. కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న నితీశ్‌కుమార్‌రెడ్డి(54 బంతుల్లో 42, 3ఫోర్లు, 3సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో కదంతొక్కాడు. ఆసీస్ పేస్ స్టార్ మిచెల్ స్టార్క్(6-48) ధాటికి టీమ్ఇండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
స్టార్క్ పదునైన పేస్ బౌలింగ్‌తో టీమ్ఇండియా ఆరుగురు సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమయ్యారు. మెరుపు వేగానికి స్వింగ్ జోడిస్తూ గులాబీ బంతితో స్టార్క్ తనదైన శైలిలో చెలరేగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. నాథన్ మెక్‌స్వీని(38), లబుషేన్(20) క్రీజులో ఉన్నారు. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆసీస్ ప్రస్తుతం 94 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ(13) వికెట్ తీయడం ద్వారా బుమ్రా(1-13) ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
అడిలైడ్ పోరులో టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ మరో ఆలోచన లేకుండానే బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. పచ్చికతో కూడిన పిచ్‌పై బ్యాటింగ్ ఎంతటి ప్రమాదమో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే తెలిసొచ్చింది. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే యశస్వి జైస్వాల్(0)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. వికెట్ల ముందు దొరికిపోవడంతో జైస్వాల్..డీఆర్ఎస్కు వెళ్లే సాహాసం కూడా చేయలేకపోయాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్(31) నిలకడ కనబరిచాడు. రాహుల్ జతగా ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. 21 బంతుల వరకు ఖాతా తెరువని గిల్..స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్‌లో బోలాండ్(2-54), కమిన్స్(2-41)ను రాహుల్ దీటుగా ఎదుర్కొన్నాడు.
ఈ క్రమంలో ఓసారి రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బోలాండ్ వేసిన బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించడంతో రాహుల్‌కు లైఫ్ లభించింది. ఇన్నింగ్స్‌కు గాడిలో పడిందనుకున్న తరుణంలో గిల్‌ను బోలాండ్ ఎల్బీడబ్ల్యూ చేయడంతో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఓవైపు బోలాండ్, మరోవైపు స్టార్క్ కూడా విజృంభించడంతో టీమ్ఇండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. స్టార్క్ దూకుడుతో 12 పరుగుల తేడాతో భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. రాహుల్, కోహ్లీ(7), రోహిత్(3) నిరాశపర్చడంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 81-4 స్కోరుకు పరిమితమైంది.
ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్నా..యువ క్రికెటర్ నితీశ్‌కుమార్ మెరుగైన పరిణతి కనబరిచాడు. స్టార్క్ గులాబీ బంతితో ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్‌తో బెంబెలెత్తిస్తున్నా..ఎక్కడా వెరువకుండా నితీశ్ బ్యాటింగ్ కొనసాగించాడు. 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో రిషబ్ పంత్(21)తో కలిసి నితీశ్ అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. ఆసీస్ బౌలింగ్ దాడిని తిప్పికొడుతూ నితీశ్ బ్యాటింగ్ కొనసాగించడంతో స్కోరు 150 పరుగుల మార్క్ దాటింది.
స్టార్క్ బౌలింగ్‌లో రివర్స్ స్కూపింగ్ ద్వారా నితీశ్ కొట్టిన షాట్ చూస్తే వారెవ్వా అనాల్సిందే. అయితే ఆరో వికెట్‌కు 22 పరుగులు జత చేసి పంత్ ఔట్ కాగా, నితీశ్, అశ్విన్(22) దూకుడు కనబరిచారు. స్టార్క్ మరోమారు టీమ్ఇండియాను దెబ్బతీశాడు. నాలుగు బంతుల తేడాతో అశ్విన్, రానా(0)ను ఔట్ చేసిన స్టార్క్..ఆఖర్లో నితీశ్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 82-4తో మెరుగ్గా కనిపింపిచన టీమ్ఇండియా 98 పరుగుల తేడాతో చివరి 6 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది.
అడిలైడ్ పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు ఒకింత నిలకడ కనబరిచారు. బుమ్రా పేస్ దాడిని కాచుకుకూర్చుకుంటూ స్కోరుబోర్డుకు కీలకపరుగులు జతచేశారు. ఓపెనర్ ఖవాజ మరోమారు నిరాశపరిచగా, మెక్‌స్వీని(38) బుమ్రా బౌలింగ్‌లో బతికి పోయాడు. మెక్‌స్వీని ఇచ్చిన క్యాచ్‌ను పంత్ విడిచిపెట్టడంతో ఆసీస్‌కు కలిసొచ్చింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న లబుషేన్..టీమ్ఇండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 44.1 ఓవర్లలో 180 ఆలౌట్(నితీశ్ 42, రాహుల్ 37, స్టార్క్ 6-48),
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 33 ఓవర్లలో 86-1(మెక్‌స్వీని 38, లబుషేన్ 20, బుమ్రా 1-13)