Sachin Tendulkar : అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో నిప్పులు చెరిగిన మహ్మద్ సిరాజ్(Siraj) ఓవల్‌లో గేమ్ ఛేంజర్ అయ్యాడు. ఐదో రోజు తొలి సెషన్లో సంచలన స్పెల్‌తో మూడు వికెట్లు తీసి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడీ పేస్ గన్. సిరీస్ సమం కావడంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌పై మాజీలు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. అలుపన్నది ఎరుగని యోధుడిలా ఐదుకు ఐదు టెస్టులాడడమే కాకుండా.. బుమ్రా గైర్హాజరీలో పేస్ దళానికి నాయకత్వం వహించిన మియా భాయ్‌కు తగినంత పేరు రాలేదని సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అన్నాడు.
ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో ‘మ్యాచ్ విన్నర్’గా నిలిచిన సిరాజ్ తన బౌలింగ్‌తో దిగ్గజాల మన్ననలు అందకుంటున్నాడు. అత్యుత్తమ బౌలర్ అంటూ పలువురు కితాబిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సైతం దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘ఐదు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ ప్రదర్శన నమ్మశక్యం అనిపించలేదు. చాలా గొప్పగా బౌలింగ్ చేశాడు. అతడి ఆటిట్యూడ్ నాకెంతో నచ్చింది. అతడి పాదాలలో ఉన్న లయ, వేగం చాలా నచ్చాయి. నిలకడగా లైన్ అండ్ లెంగ్త్‌తో ఆఖరి రోజు సిరాజ్ సూపర్ స్పెల్ వేశాడు.
సిరీస్‌లో అప్పటికే 1,000కి పైగా బంతులు వేసిన అతడు.. ఐదో రోజు కూడా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడని కామెంటేటర్లు చెప్పగా విన్నాను. అతడి ధైర్యం, జట్టును గెలిపించాలనే అతడి కసి అద్భుతం. జట్టుకు అవసరమైన ప్రతిసారి సిరాజ్ నేనున్నానంటూ ముందుకొస్తాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ కెప్టెన్ బౌలర్ అనిపించుకుంటాడు. గతంలో చేసినట్టే ఈ సిరీస్‌లోనూ ఈ పేస్ గన్ తన సత్తా చాటాడు. సిరీస్‌లో అతడు తీసిన వికెట్లే అందుకు నిదర్శనం. ఎంతో ప్రతిభ ఉన్నా సరే సిరాజ్‌కు మాత్రం తగినంత గుర్తింపు రాలేదు. అని టెండూల్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో ఆల్‌టైమ్ రికార్డు అంటే సిరాజ్‌దే. ప్రధాన పేసర్ బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ యూనిట్‌కు దళపతిగా వ్యవహరించిన మియా భాయ్ అత్యధిక వికెట్ల(23) వీరుడిగా నిలిచాడు. అలుపన్నదే తెలియదన్నట్టు ఐదు టెస్టులు ఆడిన సిరాజ్ 185.5 ఓవర్లు (1,113 బంతులు) బౌలింగ్ చేశాడు. ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడీ హైదరాబాదీ.
ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో బాక్సింగ్ డే టెస్టుతో అరంగేట్రం చేసిన సిరాజ్ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్.. ఇలా విదేశాల్లో తనదైన ముద్ర వేశాడీ హైదరాబాదీ గల్లీబాయ్. అయితే.. మర్రిచెట్టు నీడన ఏ మొక్క ఉనికి చాటుకోలేదు అన్నట్టు.. బుమ్రా, షమీలకు వచ్చినంతగా అతడికి పేరు రాలేదు. కానీ, వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ మోకాలి సర్జరీతో జట్టుకు దూరమవ్వడం.. బుమ్రా తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటుండడంతో ఇక పేస్ దళానికి సిరాజే పెద్ద దిక్కు అవుతున్నాడు.
Is Mohammed Siraj underrated? 💪
More from Sachin Tendulkar here: https://t.co/2J67i8sQiZ pic.twitter.com/DbgD4XD7HZ
— ESPNcricinfo (@ESPNcricinfo) August 6, 2025