Telangana | నాటి సమైక్య పాలనలో తీవ్ర నిరాదరణకు గురైన క్రీడలు నేటి ప్రత్యేక తెలంగాణలో ప్రగతి పథంలో దూసుకెళుతున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఆటలకు అందలమిస్తున్న ప్రభుత్వం దేశానికి దిక్సూచిలా నిలుస్తున్నది. ఆటలు ఆరోగ్యానికే కాదు సమాజానికి మేలు చేకూరుస్తాయన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కనీవినీ ఎరుగని రీతిలో సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దాలనే తలంపుతో ఓవైపు స్టేడియాల నిర్మాణం, మరోవైపు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి కొత్త శకానికి నాందిపలికారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేయాలన్న కేసీఆర్ విజన్‌ను అందిపుచ్చుకుంటూ క్రీడాశాఖ, సాట్స్ ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత చదువుల్లో రిజర్వేషన్ కోటాను అమలు చేస్తూ ప్రభుత్వం క్రీడలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించిన ప్లేయర్లను భారీ నగదు ప్రోత్సాహకాలతో సత్కరిస్తున్నది. ఆరోగ్య తెలంగాణ సాకారమే లక్ష్యంగా అవిరళ కృషి చేస్తున్న ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల వేళ క్రీడాప్రగతిపై ప్రత్యేక కథనం.
తెలంగాణలో క్రీడలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళుతూ దేశానికి దిక్సూచిలా నిలుస్తున్నాయి. మిగతా రంగాల్లో వలే క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తూ దేశంలో మొదటి స్థానంలో నిలుపాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళుతున్నది. గడిచిన దశాబ్ద కాలంలో రాష్ట్ర క్రీడారంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడక ముందు స్పోర్ట్స్ స్కూల్ హకీంపేటకు పరిమితం కాగా, స్వరాష్ట్రంలో కరీంనగర్, ఆదిలాబాద్‌లో ఏర్పాటుతో క్రీడాకారులకు మరింత చేరువైంది. దీనికి తోడు రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గానికి మినీ స్టేడియం నిర్మాణాలు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 నియోజకవర్గాల్లో 113 నిర్మాణాలు, ఆధునీకరణ పనులకు గాను ప్రభుత్వం రూ.231.56 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో రూ.85.25 కోట్లతో 41 నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన 34 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇలా వీటికి తోడు రాష్ట్రంలో ఆరు స్పోర్ట్స్ అకాడమీలు ప్లేయర్లకు అందుబాటులోకి వచ్చాయి. వనపర్తి(బాస్కెట్‌బాల్), మహబూబ్‌నగర్, సిరిసిల్ల, రంగారెడ్డి (వాలీబాల్), గజ్వేల్ (ఫుట్‌బాల్), సిద్దిపేటలో ప్లేయర్లు మెరుగైన తర్ఫీదు పొందుతున్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) వెలోడ్రమ్లో సైక్లింగ్, రెజ్లింగ్ సాట్స్ అకాడమీల ద్వారా ప్రతిభ కల్గిన యువ ప్లేయర్లు వెలుగులోకి వస్తున్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. అన్ని రంగాల్లో అభివృద్ధి లాగానే క్రీడల్లోనూ దేశం దృష్టికి అగుపించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతున్నది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో సాట్స్ ముందుకెళుతున్నది. క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు స్టేడియాల నిర్మాణం, గ్రామీణ క్రీడా ప్రాంగణాలను భారీ ఎత్తున ఏర్పాటు చేశాం. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల సహకారంతో దేశంలో తెలంగాణను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు సాట్స్ కృషి చేస్తుంది.
– ఆంజనేయగౌడ్, సాట్స్ చైర్మన్