బెంగళూరు: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొననున్న భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టులో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ చోటు దక్కించుకుంది. వచ్చే నెలలో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య(టీటీఎఫ్ఐ) మంగళవారం నలుగురు సభ్యులతో కూడిన మహిళల జట్టును ప్రకటించింది. ఇందులో శ్రీజతో పాటు భారత టాప్ ప్యాడ్లర్ మనికా బాత్రా, అర్చనా కామత్, రీతు దేశాయ్ చోటు దక్కించుకున్నారు.
దియా స్టాండ్‌బైగా ఎంపికైంది. కాగా.. ఈ జట్టుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మనికాబాత్రా 39వ స్థానంలో ఉండగా.. అర్చన 66, శ్రీజ 69 ర్యాంక్‌ల్లో ఉన్నారు. సీనియర్ ప్లేయర్లు ఐహిక, సుతీర్థని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. పురుషుల జట్టులో శరత్ కమల్, సాతియాన్, హర్మీత్ దేశాయ్, మనుశ్ షా చోటు దక్కించుకున్నారు. మెగా టోర్నీకి ముందు 15 మంది (8 మంది పురుషులు, ఏడుగురు మహిళలు)తో కూడిన భారత టీటీ బృందం క్రొయేషియా, స్లొవేకియా, హంగేరీలో పలు టోర్నీల్లో పాల్గొననుంది. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న మనవాళ్లకు సరైన సన్నాహకం కోసం ఈ టూర్‌ను ఏర్పాటు చేసినట్లు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య వెల్లడించింది.