భోపాల్: తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోమారు తళుక్కున మెరిసింది. తన పంచ్ పవర్‌కు తిరుగులేదని నిరూపిస్తూ అపజయమెరుగకుండా అప్రతిహత విజయాలతో జాతీయ చాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ చాంపియన్ పేరును నిలబెట్టుకుంటూ, ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేసిన నిఖత్ పసిడి పతకం సొంతం చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో రైల్వేస్ బాక్సర్ అనామికపై అలవోక విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై, మంజురాణి స్వర్ణాలు సొంతం చేసుకున్నారు.
భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ కెరీర్లో 2022 మరుపురాని ఏడాదిగా మిగిలిపోనుంది. కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఈ ఇందూరు ప్లేయర్ జాతీయ చాంపియన్‌షిప్‌లో తన వరుస టైటిళ్ల పరంపరను కొనసాగిస్తున్నది. 2018 మొదలు వరుసగా ప్రతి ఏటా టైటిళ్లను సొంతం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నది. భోపాల్ వేదికగా సోమవారం ముగిసిన 6వ మహిళల ఎలైట్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ టైటిల్ విజేతగా నిలిచింది. టోర్నీలో నాకౌట్ విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఈ యువ బాక్సర్ అదే జోరు కొనసాగించింది. మహిళల 50 కిలోల టైటిల్ బౌట్లో నిఖత్ 4-1 తేడాతో అనామిక(రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు)పై అద్భుత విజయం సాధించింది.
ఆది నుంచే పవర్ఫుల్ పంచ్‌లతో చెలరేగిన జరీన్ ఎక్కడా వెనుకకు తగ్గకుండా విరుచుకుపడింది. ఈ క్రమంలో ప్రత్యర్థి ఎత్తులను చిత్తుచేస్తూ పంచ్‌లకు తోడు హుక్స్, బాబ్స్తో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. బౌట్‌ను 5-0తో ముగిద్దామనుకున్న నిఖత్‌కు అనామిక నుంచి ఒకింత ప్రతిఘటన ఎదురవ్వడంతో అది సాధ్యపడలేదు. మరోవైపు మహిళల 75 కిలోల తుది పోరులో లవ్లీనా బొర్గోహై 5-0తో అరుంధతి చౌదరి(సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు)పై అలవోక విజయం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ రజత విజేత మంజురాణి (48కి) 5-0తో కళావణిని చిత్తుగా ఓడించింది. సాక్షి (52కి), శిక్ష (54కి), మనీశా (57కి), పూనమ్ (60కి), శశి చోప్రా (63కి), నూపుర్ (81+కి), సవీటి (81కి) స్వర్ణాలు సొంతం చేసుకున్నారు. మొత్తం 10 పతకాలు దక్కించుకున్న రైల్వేస్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.
నిఖత్‌కు అభినందనలు
జాతీయ ఎలైట్ మహిళ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన నిఖత్ జరీన్‌కు క్రీడామంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోమవారం అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలతో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. మరోవైపు జాతీయ చాంపియన్‌గా నిలిచిన నిఖత్‌ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
నా కెరీర్లో ఈ ఏడాది మరిచిపోలేనిది. ప్రతిష్ఠాత్మక టోర్నీలైన స్ట్రాంజా, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ టోర్నీలో స్వర్ణాలు సాధించడం అద్భుతం. జాతీయ బాక్సింగ్ టోర్నీలో పసిడి ద్వారా ఈ ఏడాది ఘనంగా ముగించడం సంతోషంగా ఉంది’
– నిఖత్ జరీన్