భువనేశ్వర్: ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో తెలంగాణ స్టార్ అథ్లెట్ అగసర నందిని పసిడి కాంతులు విరజిమ్మింది. అంచనాలను తలక్రిందులు చేస్తూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నందిని స్వర్ణ పతకాన్ని సగర్వంగా ముద్దాడింది. రెండు రోజుల పాటు జరిగిన హెప్టాథ్లాన్ ఈవెంట్లో మొత్తం 5460 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అనామిక(4997, కేరళ), దీపిక(4817, తమిళనాడు) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. తొలుత మంగళవారం జరిగిన నాలుగు ఈవెంట్లలో నందిని తనదైన ఆధిపత్యం ప్రదర్శించింది. 100మీటర్ల హర్డిల్స్ రేసును ఈ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి 14.21సెకన్లలో ముగించి పతక పోటీని ఘనంగా ప్రారంభించింది. ఆ తర్వాత జరిగిన హైజంప్‌లో 1.64మీటర్ల ఎత్తు దూకింది. షాట్‌పుట్‌లో 12.23మీటర్లు, 200మీటర్ల రేసును 25.23 సెకన్లలో ముగించింది. బుధవారం జరిగిన మిగతా మూడు ఈవెంట్లలోనూ నందిని తన జోరును కనబరిచింది. లాంగ్‌జంప్‌లో 5.64మీటర్లు, జావెలిన్‌త్రోలో 41.13మీటర్లు, 800మీటర్ల రేసును 2:25:06సెకన్లలో ముగించి నంబర్‌వన్‌లో నిలిచింది. మొత్తం ఏడు ఈవెంట్లు కలిపి 5వేలకు పైగా పాయింట్లను ఖాతాలో వేసుకుంది.
ఫెడరేషన్ కప్ సీనియర్టోర్నీలో పసిడి పతకం సాధించడం చాలా గర్వంగా ఉంది. ఓవైపు గాయం బాధిస్తున్నా..ప్రతీ పోటీలో ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చాను. ఏడు ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శన కనబరిచి అగ్రస్థానంలో నిలిచాను. వచ్చే నెలలో పంచకులలో జరుగనున్న టోర్నీలోనూ రాణించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానన్న ఆత్మవిశ్వాసం నాకుంది.
– నందిని