Vritti Agarwal | హైదరాబాద్, ఆట ప్రతినిధి: మంగళూరు(కర్నాటక) వేదికగా జరుగుతున్న 77వ జాతీయ సీనియర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన మహిళల 200మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రితి 2:09:25 సెకన్ల టైమింగ్‌తో కాంస్య పతకం సొంతం చేసుకుంది. హశిక(కర్నాటక), అదితి(మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు పురుషుల 400మీటర్ల వ్యక్తిగత మెడ్లె విభాగంలో రాష్ర్టానికి చెందిన వర్షిత్ 4:37:68సె టైమింగ్‌తో కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.
గ్రామీణ క్రికెటర్ల కోసం టీడీసీఏ
తెలంగాణ గ్రామీణ ప్రాంత క్రికెటర్ల కోసం మరో కొత్త అసోసియేషన్ పురుడు పోసుకుంది. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడేందుకు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) కొత్తగా ఏర్పాటైంది. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీడీసీఏ లోగో ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..
‘తెలంగాణ గ్రామీణ స్థాయి క్రికెటర్లకు సరైన న్యాయం జరుగడం లేదు. హెచ్‌సీఏ పూర్తిగా హైదరాబాద్ వరకే పరిమితమైంది. ఇప్పటి వరకు జిల్లాల నుంచి హైదరాబాద్ రంజీ టీమ్‌కు ఆడిన క్రికెటర్లు పెద్దగా లేరు. ఈ నేపథ్యంలోనే అద్భుత ప్రతిభ కల్గిన పల్లె క్రికెటర్లకు మద్దతుగా నిలిచేందుకు టీడీసీఏ ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో బీసీసీఐ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.