Vamsi Modem | హైదరాబాద్, ఆట ప్రతినిధి/వాజేడు: మాల్టా వేదికగా జరిగి ప్రపంచ జూనియర్ ఎక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యవ లిఫ్టర్ మోడం వంశీ పసిడి పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల 66కిలోల విభాగంలో బరిలోకి దిగిన వంశీ..బెంచ్‌ప్రెస్‌లో 140కిలోలు, స్కౌట్స్ 280కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 242.5 కిలోలతో మొత్తంగా 662.5 కిలోల బరువుతో స్వర్ణ పతకంతో సత్తాచాటాడు.
ఇదే విభాగంలో అంటోన్ సవ్కిన్(కజకిస్థాన్), హిరాము కోజిమ(జపాన్) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన వంశీ గత కొంత కాలంగా అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ టోర్నీల్లో పతకాలు కొల్లగొడుతున్నాడు.
పోటీకి దిగిన దాదాపు ప్రతీ టోర్నీలో ప్రతిభ కనబరుస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాడు. పవర్‌లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించిన తొలి ఆదివాసీ ప్లేయర్‌గా వంశీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.