వరంగల్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి), హనుమకొండ చౌరస్తా: వరంగల్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బోణీ కొట్టింది. గురువారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా జరిగిన మహిళల 4X100 మీటర్ల రిలే రేసులో రాష్ట్ర అథ్లెట్లు కాంస్య పతకంతో మెరిశారు. హీట్స్‌లో సత్తాచాటిన యువ స్ప్రింటర్లు అగసర నందిని, జివాంజీ దీప్తి, నకిరేకంటి మాయావతి, గందె నిత్య ఫైనల్లోనూ ప్రతిభ చాటారు. ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీ ఎదురైనా 47.18సెకన్లలో పరుగును పూర్తి చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులైన నందిని, మాయావతితో పాటు వరంగల్‌కే చెందిన దీప్తి, నిత్య(రంగారెడ్డి) సమిష్టి ప్రదర్శనతో రాష్ర్టానికి తొలి పతకాన్ని అందించి పలువురి అభినందనలు అందుకున్నారు. ఇదే రేసులో పోటీపడ్డ రైల్వేస్(45.84సె) పసిడి పతకంతో మెరువగా, తమిళనాడు(47.06సె) రజత పతకం దక్కించుకుంది.
హర్మీలన్ ‘రికార్డు’ పరుగు
జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో రికార్డుల వేట మొదలైంది. మహిళల 1500మీటర్ల రేసులో పంజాబ్ స్ప్రింటర్ హర్మీలన్కౌర్ బైన్స్(4:05:39సె) పసిడి పతకంతో మెరిసింది. చిరుతను తలపించిన హర్మీలన్ కొత్త రికార్డును నెలకొల్పింది. సరిగ్గా 19 ఏండ్ల క్రితం బుసాన్(2002) ఆసియా గేమ్స్‌లో సునీతా రాణి (4:06:03సె) ప్రదర్శనను కౌర్ తిరుగరాసింది. జనవరి (2020) నుంచి జాతీయ స్థాయి టోర్నీ ల్లో తిరుగులేకుండా రాణిస్తున్న కౌర్..తన టైమింగ్‌ను మరింత మెరుగుపర్చుకుంది. ఖేలోఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఫెడరేషన్ కప్, ఇండియన్ గ్రాం డ్‌ప్రి టోర్నీల్లో సత్తాచాటిన ఈ పంజాబీ స్ప్రింటర్ శనివారం నాటి పోటీలో అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంది. ఇదే రేసులో పోటీపడ్డ చందా (4:18:24సె), కేఎమ్ దీక్ష (4:21:34సె) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.
పురుషుల 100 మీటర్ల రేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నరేశ్‌కుమార్ (10.30సె)సరికొత్త మీట్ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచాడు. 2001లో తమిళనాడుకు చెందిన అనిల్‌కుమార్ (10.37సె) రికార్డును నరేశ్ తాజాగా అధిగమించాడు. పురుషుల 20కి.మీలో రేస్ వాకింగ్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన చందన్‌సింగ్(1.29.21) మొదటి స్థానంలో నిలిచి స్వర ్ణపతకం కైవసం చేసుకోగా, దేవేందర్‌సింగ్(సర్వీసెస్, 1.29.26), జూనీద్ (రైల్వేస్ 1.29.38) వరుసగా రజత, కాంస్యాలు గెలిచారు. మహిళల విభాగంలో రాజస్థాన్‌కు చెందిన సోనల్ సుక్వాల్ (1.42.15) స్వర్ణపతకం సాధించగా, రవీణ(రైల్వేస్, 1.44.17) రజత పతకం, పాయల్ (ఉత్తరాఖండ్, 1.48.12) కాంస్యం గెలుచుకున్నారు.