Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మూడో రోజు ఎపిసోడ్‌లోనే ఇంటి సభ్యుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. టాస్క్‌ల విషయంలో రెండు టీమ్‌లు విఫలమవడంతో మొదలైన హైరిస్క్ వ్యవహారం.. ఆ తర్వాత కెప్టెన్సీ, ఇంటి పనుల విభజన, మానిటరింగ్ విషయంలో గొడవలకు దారితీసింది. ముఖ్యంగా రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచింది. మరోవైపు షాలిని తనకు వచ్చిన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి వర్షిణికి పనిష్మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో రెండు టీమ్‌లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాయి. దీంతో రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హైరిస్క్‌లో పెట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.బ్లూ టీమ్ నుంచి తన పేరును తానే ముందుకు తెచ్చుకున్నాడు రాంప్రసాద్. తన టీమ్ సభ్యులతో మాట్లాడిన ఆయన.. తానే హైరిస్క్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఇక రెడ్ టీమ్‌లో చరణ్, షాలినిలలో ఒకరిని ఎంపిక చేయాలని సభ్యులు నిర్ణయించుకున్నారు. చివరకు గ్రూప్ నిర్ణయంతో చరణ్‌ను హైరిస్క్‌లోకి పంపించారు. చరణ్‌ను దేబ్జానీ ప్రశ్నించగా.. తాను ఎందుకు వ్యతిరేకించలేదని అడిగింది. అయితే అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, గ్రూప్ తీసుకున్న నిర్ణయం కావడంతో అంగీకరించానని చరణ్ చెప్పాడు. హైరిస్క్‌లో ఉన్న రాంప్రసాద్, చరణ్‌లకు బిగ్‌బాస్ మరో షాక్ ఇచ్చాడు. ఇద్దరూ తమ తమ టీమ్‌లలో ఉండే హక్కును కోల్పోయినట్లు ప్రకటించాడు. దీంతో బ్లూ టీమ్ కెప్టెన్‌గా ఉన్న రాంప్రసాద్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదట ముఖేశ్, త్రిగుణ్ పేర్లు వినిపించినప్పటికీ.. చివరకు రాంప్రసాద్ సూచనతో దేబ్జానీకి బ్లూ టీమ్ కెప్టెన్సీ దక్కింది.ఇదిలా ఉండగా త్రిగుణ్, రోహిత్ మధ్య కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. తాను నాయకత్వం వహించగలనని, అయితే ఇంట్లో ప్రతి ఒక్కరూ తమను తాము నిరూపించుకోవాలని చూస్తున్నందున తాను వెనక్కి తగ్గుతున్నానని త్రిగుణ్ చెప్పాడు.
బ్యాడ్జ్‌ల టాస్క్‌లో భాగంగా దేబ్జానీ.. ముఖేశ్‌కు ప్రత్యేకమైన బ్యాడ్జ్ ఇచ్చింది. ముఖేశ్ కళ్లు చాలా బాగున్నాయని, అతను చాలా చార్మింగ్‌గా కనిపిస్తున్నాడని చెప్పి ‘చార్మింగ్’ బ్యాడ్జ్ ఇచ్చింది. ఈ బ్యాడ్జ్‌తో ముఖేశ్ కూడా చాలా సంతోషించాడు. తన అభిమానులు కూడా దీనిని చూసి ఆనందిస్తారని దేబ్జానీ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత బిగ్‌బాస్ రెండు టీమ్‌లను పిలిచి ఇంటి పనులకు సంబంధించిన బాధ్యతలను అప్పగించాడు. ఒక టీమ్ ఇంటి పనులు చేయాల్సి ఉంటే.. మరో టీమ్ వాటిని మానిటర్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఇరు టీమ్‌ల మధ్య చర్చ జరిగిన తర్వాత బ్లూ టీమ్ పనులు చేయాలని, రెడ్ టీమ్ మానిటరింగ్ చేయాలని దేబ్జానీ ప్రతిపాదించింది. అయితే రోహిత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. తమ టీమ్ కూడా పనులు చేయగలదని, తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరాడు.
రోహిత్ మాట్లాడుతున్న తీరుపై వర్ష, త్రిగుణ్, కృష్ణ తదితరులు స్పందించడంతో పరిస్థితి క్రమంగా వేడెక్కింది. రోహిత్ తమతో పోలికలు తీసుకొస్తున్నాడంటూ వారు వ్యాఖ్యానించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.ఇక ఇంటి పనుల సమయంలో రోహిత్, సుధీర్ మధ్య కూడా వివాదం చోటుచేసుకుంది. తనకు సంబంధించిన పనిని తాను చేయాలని, తన పని సుధీర్ ఎందుకు చేశాడంటూ రోహిత్ ప్రశ్నించాడు.ఇదే సమయంలో త్రిగుణ్ కూడా మధ్యలోకి రావడంతో రోహిత్ అతడిని ప్రశ్నించాడు. తనకు సంబంధం లేని విషయాల్లో త్రిగుణ్ జోక్యం చేసుకోవద్దంటూ రోహిత్ చెప్పడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇంటి పనుల విభజనలో భాగంగా దేబ్జానీ.. చరణ్‌ను కూడా పిలిచి అందరితో కలిసిమెలిసి ఉండాలని సూచించింది. అందరికీ సాయం చేస్తే ఇంట్లో మరింతగా కలిసిపోతావని చెప్పింది.అయితే చరణ్ దీనిపై స్పందిస్తూ అవసరం లేని విషయాలను మాట్లాడవద్దని అన్నాడు. ఈ సమయంలో రోహిత్ చరణ్‌కు మద్దతుగా నిలవడంతో దేబ్జానీ, రోహిత్ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది.