హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్టేట్ సెయిలింగ్ చాంపియన్‌షిప్ ఎనిమిదో ఎడిషన్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా జరుగుతున్న ఈ పోటీలలో రాష్ట్రంలోని 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు ఆరు విభాగాల్లో పోటీపడనున్నారు. తొలిరోజు ప్రతికూల వాతావరణంలోనూ సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ట్రెయినింగ్, ప్రాక్టీస్‌తో సందడి చేశారు. దేశంలోనే అతిపెద్ద చాంపియన్‌షిప్‌లలో ఒకటైన ఈ టోర్నీలో తెలంగాణ గడిచిన పదేండ్లలో 60 మందికి పైగా జాతీయ చాంపియన్లు, 275 పతకాలతో ముందంజలో ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ సెయిలింగ్ సంఘం అధ్యక్షుడు సుహేమ్ షేక్ మాట్లాడుతూ.. ‘ఈసారి 29ఈఆర్ స్కిఫ్, 420 డబుల్ హ్యాండర్స్ విభాగాలను జోడించడంతో అన్ని కేటగిరీల్లో రికార్డు ఎంట్రీలు నమోదయ్యాయయి. తెలంగాణలో ప్రతిభావంతులను గుర్తించి తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. చైనాలో జరిగే 2026 ఆసియా క్రీడలు, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించాం’ అని అన్నారు.