PM Modi | హైదరాబాద్ మే 19 (నమస్తే తెలంగాణ): ఖేలో ఇండియా గేమ్స్.. దేశంలో ప్రతిభ కల్గిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన పథకం. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో మన ప్లేయర్లు పతకం సాధించేందుకు సరైన వేదిక. ప్రతిభ అనేది ఒక రాష్ర్టానికే పరిమితం కాదు. చేతులు రెండు కలిస్తేనే చప్పట్లు మోగినట్లు..రాష్ర్టాలన్నీ రాణిస్తేనే దేశానికి పేరు.
కానీ ఇక్కడే బీజేపీ ప్రభుత్వం వివక్ష పాటించింది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు కోట్లలో నిధులు కేటాయిస్తూ, విపక్ష పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల పట్ల సవతితల్లి ప్రేమ చాటుతున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్న ఖేలో ఇండియా అభివృద్ధి నిధుల్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు తమ పాలనలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. ఆయా రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చింది. కానీ, తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపింది. దేశంలోనే సుమారు 15 శాతం జనాభా (24 కోట్లు) కలిగిన ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా రూ. 439 కోట్లు మంజూరు చేసింది.
ఆ రాష్ట్రంలో మూడో వంతు జనాభా కూడా లేని గుజరాత్‌కు ఏకంగా రూ.426 కోట్లు కేటాయించింది. యూపీ, గుజరాత్ వందల కోట్లు కుమ్మరించిన బీజేపీ ప్రభుత్వం సుమారు 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణకు మాత్రం కేవలం రూ.17 కోట్లే విదిల్చింది. యూపీ తర్వాత తమ పార్టీ పాలనలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌కు 144 కోట్లు, రాజస్థాన్‌కు రూ.107 కోట్లు, మన రాష్ట్రంతో పోల్చితే సగం జనాభా కూడా లేని ఢిల్లీకి దాదాపు నాలుగు రెట్లు అధికంగా రూ. 69 కోట్లు కేటాయించింది. మన కంటే తక్కువ జనాభా కలిగిన కేరళకు కూడా మూడు రెట్లు ఎక్కువగా రూ. 55 కోట్లు మంజూరు చేసి తమ వివక్షను ఘనంగా చాటుకుంది.
ఖేలో ఇండియా నిధుల కేటాయింపుల్లో తెలంగాణపై వివక్ష చూపిన కేంద్రం వైఖరిపై మన రాష్ట్రానికి చెందిన క్రీడా వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తున్న తెలంగాణపై చిన్నచూపు చూడడం సరికాదని ఆక్షేపిస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇప్పటికే మెరుగైన క్రీడా సౌకర్యాలు ఉన్నాయని, కేంద్రం ప్రోత్సహిస్తే మరింత మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కానీ మన దేశం క్రీడల్లో వెనుకబడిపోయిందని, ఒలింపిక్స్‌లో పతకాలు రావడం లేదని పెదవివిరుస్తున్న ప్రధాని మోదీ, క్రీడాశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ మరి నిధుల కేటాయింపులో తెలంగాణ లాంటి రాష్ట్రాలకు అన్యాయం చేయడం సరికాదని ఇక్కడి క్రీడా సంఘాల బాధ్యులు ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికైనా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.
‘బీజేపీ వాళ్లు ఇచ్చిన జైశ్రీరాం నినాదాలను నమ్మి ఓటేస్తే తెలంగాణకు ఒరిగిందేంటీ? ఎనిమిది మంది ఎంపీలను పార్లమెంట్‌కు పంపిస్తే మనకు వచ్చిందేంటి? అంటే వచ్చే సమాధానం గుండు సున్నా..ప్రధాని మోదీ సొంత రాష్ట్రానికి నిధుల వరద పారిస్తున్న కేంద్ర సర్కారు తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపుతున్నది. బీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి సోమవారం ఎక్స్ వేదికగా గుజరాత్‌కు కేటాయించిన నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టులు..తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కండ్లకు కట్టారు.
ఇటు క్రీడల నుంచి మొదలుకొని కీలక ప్రాజెక్టుల వరకు తెలంగాణకు ఇచ్చిందేమీలేదని దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి అత్యధిక మంది అథ్లెట్స్ తయారవుతుండగా నిధుల కేటాయింపులో మాత్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఖేలోఇండియా కింద గుజరాత్‌కు రూ. 426 కోట్లు ఇచ్చి, తెలంగాణకు మాత్రం కేవలం రూ.17 కోట్లు విదిల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ వాసులు మేలుకోవాలని, ఏ పార్టీ ద్వారా మేలు జరుగుతుందో ఆలోచించాలని కోరారు.