నేరేడ్మెట్, డిసెంబర్ 28: విజయవాడ వేదికగా నిర్వహించిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ షట్లర్లు కె సాత్విక్ రెడ్డి, రాధిక శర్మ జంట సత్తాచాటింది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం ముగిసిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్‌లో సాత్విక్-రాధిక జంట.. 21-9, 21-15తో అషిత్ సూర్య, అమృత (కర్నాటక)పై గెలిచి గోల్డ్ మెడల్ సాధించింది.
ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌లో విజయవాడకు చెందిన 19 ఏండ్ల సూర్య చరిష్మ తమిరి, పురుషుల సింగిల్స్‌లో తమిళనాడు కుర్రాడు రిత్విక్ సంజీవి టైటిల్స్ కైవసం చేసుకున్నారు. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. తెలంగాణ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో చూపిన ప్రదర్శన అభినందనీయమని, ఇది వారి కష్టానికి, కోచ్‌ల మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు.