హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్లు సత్తాచాటారు. వేర్వేరు విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఎనిమిది పతకాలు కొల్లగొట్టారు. ఇందులో నాలుగు స్వర్ణాలు సహా రజతం, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల క్లే పీజియన్ స్కీట్ షూటింగ్(ఎన్-84)లో రాష్ర్టానికి చెందిన గుస్తి నోరియా పసిడి పతకంతో మెరిశాడు.
క్లే పీజియన్ ట్రాప్ షూటింగ్(ఎన్-72)లో దారియస్ చినాయ్ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. మరోవైపు పురుషుల 50మీటర్ల రైఫిల్ ప్రోన్(ఎన్ఎమ్-14)లో అబ్దుల్ ఖాలిక్, ముస్తఫాఖాన్, రోహిత్, ర్యాన్ ఫైజల్‌తో కూడిన తెలంగాణ బృందం పసిడి సొంతం చేసుకుంది. మహిళల 50మీ రైఫిల్ త్రీ పొజిషన్ జూనియర్ విభాగంలో ప్రణతి, శ్రీ అపూర్వ, దవళిక దేవి త్రయం రజతం ఖాతాలో వేసుకుంది.