హైదరాబాద్, ఆట ప్రతినిధి: త్వరలో మరో లీగ్ క్రీడాభిమానులను అలరించబోతున్నది. తెలంగాణ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్(టీపీబీఎల్) అన్ని హంగులతో రాబోతున్నది. ఆరు జట్ల కలయికతో వచ్చే నెల 3 నుంచి 6వ తేదీ వరకు టీపీబీఎల్ ప్రి సీజన్ జరుగనుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 500 మందికి పైగా ప్లేయర్లు పోటీపడే అవకాశమున్న లీగ్‌కు సంబంధించిన వివరాలను అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లీగ్ వివరాలను ప్రకటించారు. లీగ్‌లో ఆరు జట్లు హైదరాబాద్ హ్యాక్స్, రంగారెడ్డి రైనోస్, వరంగల్ వారియర్స్, కరీంనగర్ కింగ్స్, నిజామాబాద్ నవాబ్స్, మహబూబ్‌నగర్ బుల్స్ పోటీపడనున్నట్లు టీబీఏ అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు టీపీబీఎల్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.