అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో.. తెలంగాణ బీచ్ వాలీబాల్ జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ నేషనల్ గేమ్స్ పురుషుల బీచ్ వాలీబాల్ ఫైనల్లో తెలంగాణ 2-1 (22-24, 23-21, 15-11)తో ఆంధ్రప్రదేశ్‌ను చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన మన జట్టు.. ఆ తర్వాత తిరిగి పుంజుకొని వరుసగా రెండు గేమ్‌లలో సత్తాచాటింది. మరోవైపు కనోయింగ్‌లో తెలంగాణకు ఆదివారం రెండు కాంస్య పతకాలు దక్కాయి. కనోయ్ స్ప్రింట్ పురుషుల 1000 మీటర్ల విభాగంలో రాష్ర్టానికి చెందిన అమిత్ కుమార్ సింగ్ (4.31 సెకన్లలో) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. సునీల్ సింగ్ (సర్వీసెస్), నీరజ్ వర్మ (మధ్యప్రదేశ్) వరుసగా స్వర్ణ, రజతాలు చేజిక్కించుకున్నారు. కనోయింగ్ సీ2 1000 పురుషుల ఈవెంట్లో ప్రదీప్ కుమార్, అభయ్ కాంస్యం గెలుచుకున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటి వరకు తెలంగాణ 22 పతకాలు (8 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలు) సాధించి పట్టికలో 14వ స్థానంలో కొనసాగుతున్నది.