హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్రికెట్ ఆపరేషన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ కన్సల్టెంట్‌గా భారత మాజీ క్రికెటర్ బీకే వెంకటేష్ ప్రసాద్ సహా కోచ్, సిబ్బంది మొత్తం పది మందిని నియమించడాన్ని తప్పుపట్టింది. ఆ పది మంది నియామకాలను పకన బెడుతూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేశారు. బాపు కృష్ణరావు (బీకే) వెంకటేష్ ప్రసాద్, హిమానీ యాదవ్, మమతా కనోజియా, అర్జున్ హయసల, సబ్యసాచి, రాజశేఖర్ షన్బాల్, హైదరాబాద్ రంజీ కోచ్ వినీత్ సక్సేనా, శ్రవంతి నాయుడు, బీఆర్ సువర్ణ లక్ష్మి, ఎస్ఎన్ అమిత్ .. ఈ పది మందిని హెచ్‌సీఏ యాక్ట్ రూల్స్‌కు వ్యతిరేకంగా నియామకాలు చేశారని దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువరించారు.
వాళ్ల నియామకాలను సవాలు చేస్తూ హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు సర్దార్ దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజు, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్, అపెక్స్ కౌన్సిల్ పురుషుల విభాగ ప్రతినిధి రంగపథ్ అర్జున్ స్వరూప్, మహిళా విభాగ ప్రతినిధి వంకా రోమాసింగ్ పిటిషన్ దాఖలు చేశారు. హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లు నలుగురు కలిసి గత ఏడాది ఆగస్టు 30న అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా వెంకటేష్ ప్రసాద్ ఇతరులతో ఒప్పందం చేసుకోవడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఏడాదికి రూ.75 లక్షల వేతనంతో క్రికెట్ కార్యకలాపాలకు కన్సల్టెంట్‌గా నియమించడాన్ని పకనబెట్టారు. ఇప్పటి వరకు ఆ పది మందికి చెల్లించిన మొత్తాన్ని, నిబంధనలకు వ్యతిరేకంగా నియమించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, సీఈవోల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల నుంచి రికవరీ చేయాలని తీర్పులో పేరొన్నారు. ఈ మేరకు హెచ్‌సీఏను ఆదేశించారు. హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ (హెచ్‌సీఏఈ) కోచ్‌లు, డైరెక్టర్‌తో కూడిన క్రికెట్ కోచింగ్ అకాడమీని హెచ్‌సీఏ పకనబెట్టి పది మందిని నియామకాలు చేశారనే పిటిషనర్ల వాదనను ఆమోదించారు.