హైదరాబాద్, ఆదివారం, ఆగస్టు 31, 2025: అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ 2025 పోటీలు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పోరాడి ఓడిన తెలంగాణ పురుషుల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ (Gymkhana Ground)లో జరిగిన ఫైనల్లో కర్ణాటక టీమ్ విజేతగా నిలవగా, మహిళల విభాగంలో ఉత్తరప్రదేశ్ బృందం ఛాంపియన్‌గా అవతరించింది.
ఆద్యంతం హోరాహోరీగా సాగిన పురుషుల ఫైనల్లో కర్ణాటక జట్టు తెలంగాణను 19-12 తేడాతో ఓడించింది. మహిళల విభాగం ఫైనల్లో ఉత్తరప్రదేశ్ జట్టు చెలరేగి ఆడి కర్ణాటకపై 20-0 భారీ విజయం సాధించింది. పురుషుల విభాగం కాంస్య పతక పోరులో కేరళ 28-6 తేడాతో ఉత్తరప్రదేశ్‌పై గెలిచింది, అలాగే మహిళల విభాగంలో మహారాష్ట్ర 6-0 తేడాతో కేరళ జట్టును మట్టికరిపించింది.
‘టోర్నమెంట్ విజయవంతంగా ముగియడం పట్ల ఆర్గనైజేషన్ కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి (Praveen Reddy) సంతోషం వ్యక్తం చేశారు. వాలెడిక్టరీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “ఈ టోర్నమెంట్ క్రీడాకారుల్లో పెరుగుతుతన్న పోటీ తత్వాన్ని, క్రీడా స్పూర్తికి నిదర్శనం. అంతేకాదు ఈ ఆట మరింత విస్తరించడమే కాకుండా దేశవ్యాప్తంగా కొత్త ప్రతిభావంతులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని అన్నారు.
పురుషుల సెమీఫైనల్స్‌లో తెలంగాణ 20-19తో కేరళను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సెమీస్‌లో కర్ణాటక జట్టు 31-12తో ఉత్తరప్రదేశ్‌ను చిత్తు చేసింది. మహిళల విభాగం సెమీస్ ఫలితాల విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్ 16-0తో మహారాష్ట్రను దారుణంగా ఓడించగా.. కర్ణాటక 16-0తో కేరళను ఇంటికి పంపింది.