హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్‌కు తెలంగాణ జట్టు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఈనెల 27 నుంచి గుజరాత్ వేదికగా మొదలవుతున్న గేమ్స్‌లో 230 మంది ప్లేయర్లతో రాష్ట్ర టీమ్ బరిలోకి దిగుతున్నది. ఇటీవలి బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన రాష్ట్ర ప్లేయర్లు నేషనల్ గేమ్స్‌లోనూ అదరగొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఓవరాల్‌గా పతకాల పట్టికలో హర్యానా తర్వాత రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ జాతీయ గేమ్స్‌లో అదే జోరు కనబరుచాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్), తెలంగాణ ఒలింపిక్ సంఘం(టీవోఏ) బుధవారం సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఎల్బీ స్టేడియంలో జరిగిన సమావేశంలో టోర్నీ వివరాలను మీడియాకు తెలిపారు. 230 మంది ప్లేయర్లలో 104 మంది పురుషులు, 126 మంది మహిళలు ఉన్నారు.
దీనికి తోడు 40 మంది కోచ్‌లు, 32 మంది మేనేజర్లు టోర్నీలో పాలుపంచుకోనున్నారు. మొత్తంగా 302 మంది తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 230 మంది ప్లేయర్లు 26 క్రీడా విభాగాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సందర్భంగా తొలుత సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఇటీవలి ముగిసిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రాష్ట్ర ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అంచనాలకు మించి రాణిస్తూ దేశంలో రాష్ర్టాన్ని రెండో స్థానంలో నిలిపారు. రానున్న నేషనల్ గేమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తున్నది. ప్లేయర్లకు సన్నాహక శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు టీఏ, డీఏ అలవెన్సులు కూడా అందిస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే 29 లక్షలు కేటాయించింది. టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరిచి పతకాల పట్టికలో తెలంగాణను టాప్‌లో నిలుపుతారన్న నమ్మకముంది. పతకాలు సాధించే ప్లేయర్లకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం విషయంలో త్వరలోనే క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీడియా ప్రకటన చేస్తారు. జాతీయ క్రీడల కోసం గత కొద్ది కాలంగా ప్లేయర్లు, కోచ్‌లు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని పతకాలతో తిరిగిరావాలని’ అన్నారు. సాట్స్ సహకారంతో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు వేణుగోపాల చారి పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అనంతరం టీవోఏ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ మాట్లాడుతూ ‘జాతీయ క్రీడల కోసం 60 లక్షలు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా, ఇప్పటికే 29 లక్షలు మంజూరు చేసింది. త్వరలో మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవోఏ కోశాధికారి మహేశ్, చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్, ఏకాగ్ర చెస్ అకాడమీ చైర్మన్ సందీప్‌నాయుడు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చెస్ టోర్నీ
తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో వచ్చే ఏడాది హైదరాబాద్‌లో అంతర్జాతీయ చెస్ టోర్నీ జరుపుతామని నిర్వాహకురాలు పనాచా తెలిపారు. ఈ టోర్నీలో ప్రపంచంలోని 50 మంది అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్లు పోటీ పడుతారని తెలిపారు.