ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతున్నది. వరుస విజయాలతో జోరు మీద దూసుకెళుతున్న బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో రష్యా ప్లేయర్ మిర్రా అండ్రీవా 6-7(5/7), 6-4, 6-4తో రెండో సీడ్ సబలెంకాను చిత్తు చేసింది. అతి పిన్న వయసులో గ్రాండ్‌స్లామ్(1997 యూఎస్ ఓపెన్)టోర్నీలో సెమీస్ చేరిన మార్టినా హింగిస్ తర్వాత రెండో ప్లేయర్‌గా అండ్రీవా నిలిచింది. మ్యాచ్ విషయానికొస్తే..రెండున్నర గంటల పాటు సాగిన పోరులో ఈ 17 ఏండ్ల అన్‌సీడెడ్ రష్యా భామ..సబలెంకాకు దీటైన పోటీనిచ్చింది. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో దక్కించుకున్న సబలెంకా కోర్టులో ఒకింత ఇబ్బంది పడింది. అండ్రీవా 4 ఏస్‌లు, 43 విన్నర్లతో వరుస సెట్లలో సబలెంకను మట్టికరిపించింది.