ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిత 50 ఓవర్లలో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో టీం ఇండియా చేదించింది. ఆరు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. 252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్ భాగస్వామ్యానికి 105 పరుగులు జత చేశారు.
105 పరుగుల వద్ద మిచెల్ శాంత్నర్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ.. బ్రేస్వాల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కావడంతో క్రీజ్‌ను వదిలేశాడు. తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ జట్టు స్కోర్ చకచకా పెంచడానికి ప్రయత్నించారు. ఈ తరుణంలో 122 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్ కావడంతో టీమ్ ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. కానీ 48 పరుగులతో శ్రేయాస్ అయ్యర్, 29 పరుగులతో అక్షర్ పటేల్ వెంటవెంటనే ఔటయ్యారు.
ఈ దశలో హార్దిక్ పాండ్యా వచ్చి మెరుపులు మెరిపించి 18 బంతుల్లో 18 పరుగులు చేసి జేమ్సియన్ బౌలింగ్‌లో ఆయనకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడుతూ వీలు చిక్కినప్పుడు షాట్లు కొడుతూ జట్టు విజయ తీరాలకు చేర్చారు. 49వ ఓవర్ చివరి బంతిని ఫోర్‌గా మలిచి రవీంద్ర జడేజా టీమ్ ఇండియాను గెలిపించాడు. ఆరు వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా 254 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో మిచెల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంత్నర్ రెండేసి వికెట్లు, కేల్ జమియ్సన్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు.