Team India | ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా విజయం సాధించింది. 140 పరుగుల విజయలక్ష్యంతో టీం ఇండియా బరిలోకి దిగింది. కానీ 6.5 ఓవర్ల వద్ద వర్షం మొదలు కావడంతో మ్యాచ్ నిలిపేశారు. ఎంతకీ వర్షం తగ్గక పోవడంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని అంపైర్లు తేల్చేశారు. డక్ వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్) సిస్టమ్ ప్రకారం అప్పటికే టీం ఇండియా రెండు పరుగుల ఆధిక్యం కలిగి ఉంది. దీంతో బుమ్రా సారధ్యంలోని టీం ఇండియా.. ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ టీం 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. బ్యాటర్లు బెర్రీ మైక్ కార్తీ 51, కుర్టిస్ కంఫార్ 39 పరుగులు తీశారు. పాల్ స్టిర్లింగ్ 11, మార్క్ అడైర్ 16 పరుగులతో పర్వాలేదనిపించారు.
తర్వాత 140 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు వచ్చిన టీం ఇండియా ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ తొలి ఓవర్ లో రెండు ఫోర్లు బాదాడు. ఏడో ఓవర్ లో యంగ్ వేసిన రెండో బంతికి జైస్వాల్, మూడో బంతికి తిలక్ వర్మ పెవిలియన్ బాట పట్టారు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన శాంసన్ ఒక సింగిల్ తీశాడు. అటుపై వర్షం కురియడంతో ఆట నిలిపేసే సమయానికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.