ముంబై : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఇవాళ ప్రారంభం అవుతోంది. దక్షిణాఫ్రియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య లార్డ్స్‌లో టైటిల్ సమరం జరగనున్నది. డబ్ల్యూటీసీ విజేతలకు చెందిన ప్రైజ్‌మనీ(WTC Prize Money)ని గతంలోనే ఐసీసీ ప్రకటించింది. అయితే విజేత, రన్నరప్ జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచిన టీమిండియా జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ దక్కుతుందో ఇప్పటికే వెల్లడించారు.
టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోకి ఇండియా ప్రవేశించలేదు. కానీ ఆ జట్టుకు ప్రైజ్‌మనీలో భాగంగా 12.33 కోట్లు ఇవ్వనున్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతకు 3.6 మిలియన్ల డాలర్లు ఇవ్వనున్నారు. ఇక రన్నరప్ జట్టుకు 2.1 మిలియన్ల డాలర్ల ప్రైజ్‌మనీ ఇస్తారు.
రెండేండ్లపాటు 9 జట్ల మధ్య హోరాహోరీగా సాగిన డబ్ల్యూటీసీ సైకిల్లో 69.44 శాతంతో అగ్రస్థానం దక్కించుకున్న దక్షిణాఫ్రికా.. 19 టెస్టులాడి 13 విజయాలు, 67.54 శాతంతో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా.. టైటిల్ కోసం నేటి నుంచి అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్యాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నించనున్నది.
2023 జూన్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. ఇక తొలిసారి డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని టెంబ బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా ప్రయత్నిస్తోంది.