వడోదరా: భారత మహిళల జట్టు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. టీ20 సిరీస్ విజయంతో ఊపుమీదున్న టీమ్ఇండియా వన్డేల్లోనూ అదే జోరు కనబరిచింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 211 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పరుగుల తేడా పరంగా మహిళల వన్డేల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమంగా రికార్డుల్లోకెక్కింది.
తొలుత స్మృతి మందన (102 బంతుల్లో 91, 13ఫోర్లు) అర్ధసెంచరీకి తోడు హర్లిన్డియోల్ (44), ప్రతికా రావల్ (40) రాణించడంతో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 314/9 భారీ స్కోరు సాధించింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ మందన.. విండీస్ బౌలర్లపై విరుచుకుపడింది. పసలేని బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లతో ఆకట్టుకుంది.
జైదా జేమ్స్ (5/45) ఐదు వికెట్లతో రాణించింది. ఛేదనకు దిగిన విండీస్..రేణుకా ఠాకూర్ (5/29) ధాటికి 26.2 ఓవర్లలో 103 పరుగులకు చాపచుట్టేసింది. అలె ఫ్లెచర్ (24 నాటౌట్) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. పిచ్‌ను తనకు అనుకూలంగా మలుచుకుంటూ రేణుక వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ సూపర్ క్యాచ్‌తో ఆకట్టుకుంది. ఐదు వికెట్లతో జట్టు విజయంలో కీలకమైన రేణుకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.