Team India | టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో కొత్త సారథి ఎవరు ? అన్న చర్చ సాగుతున్నది. వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా పాల్గొనున్నది. ఈ పర్యటన కోసం బీసీసీఐ ఈ నెలలోనే జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై ఇప్పటి వరకు ఓ స్పష్టత రాలేదని తెలుస్తున్నది. కెప్టెన్ రేసులో యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య విపరీతమైన పోటీ ఉన్నది. అయితే, టెస్ట్ కెప్టెన్సీ రేసు నుంచి బుమ్రా తప్పుకున్నట్టు ఓ మీడియా నివేదిక తెలిపింది.
ఇక కెప్టెన్సీ రేసు గిల్-పంత్ మధ్యనే ఉందని పేర్కొంది. టెస్ట్ కెప్టెన్సీ బుమ్రా పేరు సైతం గట్టిగానే వినిపించింది. కానీ, పనిభారం కారణంగా ఐదు మ్యాచుల సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లోని అన్ని మ్యాచులు ఆడుతానని హామీ ఇవ్వలేనని సెలెక్టర్లకు చెప్పాడని ఓ స్పోర్ట్స్ వెబ్సైట్ తెలిపింది. ఈ పరిస్థితిలో సెలెక్టర్లు సిరీస్ అంతా నిలకడగా రాణించే ఆటగాడికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పింది. బుమ్రా స్వయంగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవడంతో సెలెక్టర్లు ప్రసుతం శుభ్‌మన్ గిల్, పంత్‌లో ఎవరైనా ఒకరిని కెప్టెన్సీకి ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ అయినా.. మరొకరిని వైస్ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ సిరీస్ కోసం భారత జట్టును ఈ నెల 24లోగా ప్రకటించే అవకాశం ఉంది.
రాబోయే ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని విరాట్ కోహ్లీ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI)కి చెప్పినట్లుగా ‘స్కైస్పోర్ట్స్ న్యూస్’ పేర్కొంది. అయితే, దీనిపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో బీసీసీఐ వర్గాలు ఈ వార్తలను ఖండించనూ లేదు. జూన్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ప్రారంభానికి ముందే తాను టెస్టుల నుంచి రిటైర్ కావాలని భావిస్తున్నట్లు విరాట్ ఏప్రిల్‌లోనే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో చెప్పినట్లు తెలిసింది. అగార్కర్, బీసీసీఐకి చెందిన ఓ అధికారి మరోసారి కోహ్లీతో సమావేశం కావాలని భావిస్తున్నారు. కోహ్లీ తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరినట్లుగా పలు నివేదికలు తెలిపాయి. అయితే, ఇప్పటి వరకు మళ్లీ తన నిర్ణయాన్ని కోహ్లీ వెల్లడించలేదని సమాచారం.