బెకెన్హామ్(కెంట్): ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌ల ద్వారా ఇక్కడి పరిస్థితులపై అవగాహనకు వచ్చిన మన క్రికెటర్లు.. శుక్రవారం నుంచి మొదలయ్యే ఇంట్రాస్వాడ్ మ్యాచ్ ద్వారా మరింత తుదికూర్పుపై అంచనాకు వచ్చే అవకాశముంది. ప్రత్యర్థికి తమ ఎత్తులు ఏమాత్రం అంచనా వేయకుండా ఇండోర్నెట్స్ ద్వారా ప్రాక్టీస్ చేస్తున్న టీమ్ఇండియా క్రికెటర్లు.. నేటి నుంచి భారత్ ‘ఏ’తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నారు.
సన్నాహక మ్యాచ్‌పై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ ‘టెస్టు మ్యాచ్‌కు సన్నాహకంగా ఇది ఉపయోగపడనుంది. రోజుకు 90 ఓవర్ల చొప్పున నాలుగు రోజుల పాటు 360 ఓవర్లు ఆడటం ద్వారా ప్లేయర్ల సామర్థ్యాన్ని పరిశీలించే అవకాశం లభిస్తుంది. ఈనెల 20న ఇంగ్లండ్‌తో మొదలయ్యే తొలి టెస్టు కోసం తుది జట్టు కూర్పుపై అంచనాకు వస్తాం.
ముఖ్యంగా రవీంద్రజడేజా, కుల్దీప్యాదవ్..ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనే దానిపై సందిగ్ధత ఉన్నది. దీనికి తోడు ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ మధ్య పోటీ నెలకొన్నది. బుమ్రా ఫిట్‌నెస్‌పై ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. పూర్తి స్థాయి మ్యాచ్ ఆడేందుకు అతను సిద్ధంగా ఉన్నాడు’ అని పేర్కొన్నాడు.