Rohit Sharma | ముంబై: ఎక్స్‌క్లూజివ్ కంటెంట్, వ్యూస్ కోసం క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ ఐపీఎల్ టీవీ హక్కుల ప్రసారదారు ‘స్టార్ స్పోర్ట్స్’పై టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించిన రోహిత్.. ‘మేం మా సహచరులు, స్నేహితులతో ట్రైనింగ్ క్యాంప్స్, మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాట్లాడుకున్న ప్రతి సంభాషణను కెమెరాలు రికార్డు చేస్తుండటంతో క్రికెటర్ల జీవితాలు చొరబాటుకు గురవుతున్నాయి.
నా సంభాషణను రికార్డు చేయొద్దని స్టార్ స్పోర్ట్స్‌ని కోరినా వాళ్లు దానిని ప్రసారం చేశారు. ఇది మా గోప్యతకు భంగం కలిగించేదే. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్, వ్యూస్ పై మాత్రమే దృష్టి సారించిన వాళ్లు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు క్రికెటర్లు, అభిమానులు, క్రికెట్ మధ్య బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి’ అని ట్వీట్ చేశాడు.
రోహిత్ కోల్‌కతాతో మ్యాచ్ సందర్భంగాఅభిషేక్ నాయర్‌తో ‘ఇదే నా చివరి సీజన్’ అన్నట్టు మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. కేకేఆర్ సోషల్ మీడియా ఖాతాల్లోంచి దానిని తీసేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక లక్నోతో మ్యాచ్ సందర్భంగా రోహిత్.. తనను వీడియో తీస్తున్న వ్యక్తితో ‘దయచేసి ఆడియోను మ్యూట్‌లో పెట్టండి’ అని కెమెరామెన్‌ను రిక్వెస్ట్ చేసినా దానిని ప్రసారం చేయడంపై టీమిండియా సారథి పై విధంగా స్పందించాడు. రోహిత్ ట్వీట్ తర్వాత ఎక్స్‌లో ‘షేమ్ ఆన్ స్టార్ స్పోర్ట్స్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారడం గమనార్హం.