రికార్డుల అడ్డా ఉప్పల్ స్టేడియం పేరు అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి మార్మోగింది. శనివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా 20 ఓవర్లలోనే 297 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.
అత్యంత పోటీతత్వమున్న భారత జట్టులో స్థానం నిలుపుకోవాలంటే తప్పకుండా ఆడాల్సిన మ్యాచ్‌లో సంజూ శాంసన్.. బంగ్లా బౌలర్లపై శివతాండవమే ఆడాడు. కొడితే సిక్స్ లేకుంటే ఫోర్ అన్న రేంజ్లో సాగిన అతడి విధ్వంసానికి సారథి సూర్యకుమార్ యాదవ్ నాటు కొట్టుడు.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ మెరుపులు తోడవడంతో టీమ్ఇండియా కొత్త చరిత్ర లిఖించింది. అనంతరం భారత బౌలర్ల విజృంభణతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
Team India | హైదరాబాద్: స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శనివారం ముగిసిన మూడో టీ20లో టీమ్ఇండియా 133 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగురవేసి సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది.
వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (47 బంతుల్లో 111, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) రికార్డు శతకానికి తోడు సూర్యకుమార్ (35 బంతుల్లో 75, 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు జతకలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల రికార్డు స్కోరు చేసింది. అనంతరం ప్రత్యర్థిని 20 ఓవర్లలో 164/7 వద్దే కట్టడి చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లా తరఫున తౌహిద్ హృదయ్ (42 బంతుల్లో 63 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ హీరో శాంసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా సిరీస్ ఆసాంతం రాణించిన హార్దిక్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ లభించింది.
గత రెండు మ్యాచ్‌లలో విఫలమై తదుపరి సిరీస్‌లలో ఉంటాడో? లేదో? అన్న పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శాంసన్.. రెండో ఓవర్ నుంచే బ్యాట్‌కు పనిచెప్పాడు. టస్కిన్ అహ్మద్ వేసిన రెండో ఓవర్లో 4 ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. అభిషేక్ శర్మ (4) మళ్లీ నిరాశపరిచినా కెప్టెన్ సూర్యతో శాంసన్ జతకలవడంతో అగ్నికి వాయువు తోడైనైట్టెంది. ఈ ఇద్దరూ బంగ్లా బౌలర్లను ఊచకోత కోశారు. సిక్సర్‌తోనే ఖాతా తెరిచిన సూర్య.. ఇన్నింగ్స్ ఆసాంతం అదే దూకుడును ప్రదర్శించాడు.
పవర్ ప్లే ముగిసేసరికి భారత్ స్కోరు 82/1గా నమోదైంది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఇదే రికార్డు. రిషద్ హోసేన్ ఏడో ఓవర్లో సంజూ 4, 4, 6తో 22 బంతుల్లోనే అర్థ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఈ ఇద్దరూ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదడంతో 7.1 ఓవర్లలోనే టీమ్ఇండియా స్కోరు వంద పరుగులు దాటేసింది. రిషదే వేసిన పదో ఓవర్లో అయితే సంజూ బాదుడుకు బంగ్లా ఫీల్డర్ల కండ్లు బైర్లు కమ్మాయి. ఆ ఓవర్ తొలి బంతిని మినహాయిస్తే మిగిలిన ఐదు బంతులకూ 6, 6, 6, 6, 6తో మొత్తంగా 30 పరుగులు వచ్చాయి.
మహ్మదుల్లా వేసిన 11వ ఓవర్లో లెగ్ సైడ్ దిశగా రెండు రన్స్ తీసిన సూర్య 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. వరుసగా 5 సిక్సర్లతో సెంచరీకి చేరువైన సంజూ.. మెహిది హసన్ 13వ ఓవర్లో తొలి బంతినే బౌండరీకి తరలించి 40 బంతుల్లోనే తన తొలి శతకాన్ని పూర్తిచేశాడు. సెంచరీ తర్వాత సంజూను ముస్తాఫిజుర్ ఔట్ చేయడంతో రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. ఈ ఇద్దరూ కలిసి 70 బంతుల్లోనే 173 పరుగులు జతచేయడం విశేషం. శాంసన్ ఔట్ అయ్యాక తదుపరి ఓవర్లోనే సూర్య కూడా పెవిలియన్ చేరినా చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34, 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
భారీ ఛేదనలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. బంగ్లా ఇన్నింగ్స్ తొలి బంతికే మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో పర్వేజ్ హోసేన్ రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఆ జట్టుకు తొలి షాక్ తాకింది. తాంజిద్ హసన్ (15), కెప్టెన్ నజ్ముల్ హోసేన్ శాంతో (14) విఫలమయ్యారు. లిటన్ దాస్ తో కలిసి తౌహిద్ హృదయ్ కాసేపు పోరాడినా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు
ఇంటర్నేషనల్ టీ20 చరిత్రలో
ఫుల్‌టైమ్ మెంబర్స్ ఆడే దేశాలలో ఇదే అత్యుత్తమ స్కోరు. (మంగోలియాపై నేపాల్ 314/3 పరుగులు చేసినా ఆ రెండూ ఇంకా అసోసియేట్ దేశాలుగానే ఉన్నాయి)
భారత్ తరఫున టీ20లలో శతకం చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్. గతంలో ఇషాన్ కిషన్ (89)
అత్యధిక స్కోరు నమోదుచేశాడు.
రోహిత్ శర్మ (35 బంతుల్లో) తర్వాత భారత్‌కు రెండో వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాటర్లలో సంజూ శాంసన్ (40 బంతుల్లో) రెండోవాడు.
ఓవరాల్‌గా సంజూ నాలుగో (మిల్లర్, రోహిత్, జాన్సన్) ఆటగాడు.
461 ఇరుజట్లూ నమోదుచేసిన స్కోరు. (2019లో అఫ్గాన్, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 472 పరుగులు నమోదయ్యాయి)
16 టీ20లలో భారత్‌కు ఇది వరుసగా 16వ సిరీస్ విజయం.