Paris Olympics | పారిస్: క్రీడాభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విశ్వక్రీడా సంబురాలకు ఎట్టకేలకు తెరలేచింది. పారిస్ వేదికగా జరుగుతున్న 33వ ఒలింపిక్స్ పోటీలలో భాగంగా బుధవారం సాకర్, రగ్బీ సెవెన్స్ మ్యాచ్‌లతో విశ్వక్రీడలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ సమీపంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాల తర్వాత ఒలింపిక్స్ అధికారికంగా ఆరంభమవనుండగా బుధవారం నుంచే టీమ్ ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి. స్పెయిన్-ఉజ్బెకిస్థాన్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌తో అంతర్జాతీయ ఆటల పండుగ మొదలైంది. గురువారం ఆర్చరీ, హ్యాండ్‌బాల్ రగ్బీ సెవెన్స్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆర్చరీలో భాగంగా గురువారం భారత ఆర్చర్లు తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ సిద్ధమయ్యాయి.
ఇటీవలే యూరో కప్ గెలిచిన జోష్‌లో ఉన్న స్పెయిన్ తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది. పశ్చిమ పారిస్‌లో ఉన్న పార్క్డెస్ ప్రిన్సెస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 2-1తో ఉజ్బెకిస్థాన్‌ను చిత్తు చేసింది. స్పెయిన్ ఫుట్‌బాలర్ మార్క్ పుబిల్ ఆట 29వ నిమిషంలో గోల్ కొట్టి ఒలింపిక్స్‌లో తొలి గోల్ కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక సారథి లియోనల్ మెస్సీ లేకుండా ఒలింపిక్స్ ఆడుతున్న అర్జెంటీనా.. మొరాకోతో మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకుంది. న్యూజిలాండ్ 1-0తో గినియాపై నెగ్గింది. రగ్బీ సెవెన్స్‌లో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫిజీ, ఐర్లాండ్ విజయాలు నమోదుచేశాయి.
ఆటల షెడ్యూల్లో భాగంగా భారత ఆర్చర్లకు తొలి పరీక్ష గురువారం ఎదురుకానుంది. మొత్తం ఐదు విభాగాల (పురుషుల, మహిళల వ్యక్తిగత, టీమ్, మిక్స్డ్ టీమ్)లో ర్యాంకింగ్ రౌండ్స్ జరుగుతాయి.