Odisha Masters : సొంతగడ్డపై జరుగుతున్న ఒడిశా మాస్టర్స్ సూపర్ 100 టోర్నమెంట్లో భారత షట్లర్లు పతకాల పంట పండించారు. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల(Dhruv Kapila), తనీశ క్రాస్టో(Tanisha Crasto) జోడీ చరిత్ర సృష్టించింది. టైటిల్ పోరులో ఏకంగా టాప్ సీడ్లను మట్టికరిపించి బంగారు పతకం కొల్లగొట్టింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సింగపూర్‌కు చెందిన హీ వై(Hee Y), టాన్ డబ్ల్యూ(Tan W) జంటను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. తద్వారా రూ. 6 లక్షల ప్రైజ్‌మనీ కూడా ఎగరేసుకుపోయింది.
మ్యాచ్ ఆరంభంలో హీ, టాన్ జోడీ దూకుడుగా ఆడడంతో ధ్రువ్, తనీశ తొలి సెట్ 17-21తో కోల్పోయారు. అయితే.. కీలకమైన రెండో సెట్లో తనీశ, ధ్రువ్.. పట్టువిడువకుండా పోరాడారు. 21-19తో రెండో సెట్ గెలిచి.. అదే జోరును మూడో సెట్లో కూడా కొనసాగించారు. మ్యాచ్ విజేతను నిర్ణయించే ఆ సెట్లో 23-21తో గెలుపొంది సింగపూర్ జోడీ పసిడి ఆశలపై నీళ్లు చల్లారు.
సతీశ్ కుమార్, ఆయూశ్ శెట్టి
పురుషుల సింగిల్స్‌లో 22 ఏండ్ల సతీశ్ కుమార్ కరుణాకరన్(Sathish Kumar Karunakaran) విజేతగా నిలిచాడు. టైటల్ పోరులో భారత్‌కే చెందిన ఆయూశ్ శెట్టి(Ayush Shetty)ని ఓడించి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఉత్కంఠ రేపిన పోరులో సతీశ్ 21-18, 19–21, 21-14తో ఆయూశ్పై పైచేయి సాధించాడు.