హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్ వేదికగా జరిగిన అరో రియాల్టీ టీ9 గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో బంకర్ బస్టర్స్ విజేతగా నిలిచింది. శనివారం ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన టైటిల్ పోరులో బంకర్ బస్టర్స్ సడెన్ డెత్‌లో టూటోరూట్పై అద్భుత విజయం సాధించింది. తొలుత జరిగిన ఫైనల్ రౌండ్(ఫ్రంట్ 9) సింగిల్స్‌లో టూటోరూట్ గోల్ఫర్ రేయ్ నూర్హోహ 1-0తో ప్రతీమ్కుమార్(బంకర్ బస్టర్స్)పై గెలువగా, గౌతమ్(టూటోరూట్)0-1 రాజు(బస్టర్స్) చేతిలో ఓడాడు.
డబుల్స్‌లో ఇరు జట్ల మధ్య స్కోరు 1-1తో సమమైంది. రౌండ్-2(బ్యాక్ 9)తో పాటు ప్లేఆఫ్స్‌లో పోరు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు సడెన్‌డెత్ తప్పని సరైంది. ఇందులో బంకర్ బస్టర్స్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. టీ గోల్ఫ్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎన్ఆర్ఎన్ రెడ్డి విజేతకు ట్రోఫీ అందజేశారు.