ఢాకా: టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని డిమాండ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఆశాభంగమే అయింది. బంగ్లా డిమాండ్లకు ఐసీసీ పరిగణనలోకి తీసుకోలేదు. భారత్‌లో ఆడతారా? లేదా? అన్నదానిపై జనవరి 21 నాటికి తేల్చాలని గడువు విధించిన ఐసీసీ.. బుధవారం ఈ అంశంపై చర్చించడానికి శాశ్వత సభ్య దేశాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది. బంగ్లాదేశ్ అభ్యర్థనపై ఓటింగ్ నిర్వహించగా 16 దేశాలకు గాను 14 దేశాలు అందుకు వ్యతిరేకంగా ఓటువేశాయి.
పాకిస్థాన్ మాత్రమే బంగ్లాకు మద్దతు తెలిపింది. ఒకవేళ బంగ్లా గనుక భారత్‌కు రాకుంటే స్కాట్లాండ్తో ఆ జట్టును భర్తీ చేయాలనేదానిపైనా సభ్యదేశాలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు తమకు మరొక రోజు కావాలని బంగ్లా అభ్యర్థించడంతో ఐసీసీ అందుకు అంగీకరించింది. బంగ్లా క్రికెటర్లు, మీడియా ప్రతినిధులు, అధికారులు, అభిమానుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని ఐసీసీ మరోసారి స్పష్టం చేసింది. బంగ్లా మ్యాచ్‌లు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఐసీసీ తెలిపింది. మరి బంగ్లాదేశ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేదానిపై ఆసక్తి నెలకొంది.