దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. ప్రపంచకప్‌లలో తొలిసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్ తర్వాత భారత పేసర్ మహమ్మద్ షమీపై నెట్టింట్ విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతనిపై జరుగుతున్న ఈ ఆన్లైన్ దాడిని చాలా మంది క్రికెటర్లు ఖండించారు. తాజాగా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఈ అంశంపై స్పందించాడు.
ఒక ప్రముఖ పత్రికకు రాసిన వ్యాసంలో షమీపై జరుగుతున్న ఆన్లైన్ దాడిని వెర్రితనంగా అభివర్ణించిన గంభీర్.. ‘మనం ఎక్కడకు వెళ్తున్నాం?’ అని ప్రశ్నించాడు. ‘ఆదివారం నాడు భారత్ ఓడిపోతే ఆ మరుసటి రోజు నుంచే జట్టు, భారత దేశం పట్ల షమీ చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇంతకన్నా వెర్రితనం మరొకటి ఉండదు. అంటే జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ఒక మతానికి చెందిన వారు కాబట్టి దేశం పట్ల వారికి మరింత నిబద్ధత ఉన్నట్లా? మనం ఎటువైపు వెళ్తున్నాం?’ అని గంభీర్ ఆందోళన వ్యక్తం చేశాడు.
షమీ తనకు వ్యక్తిగతంగా తెలుసని, తన సారధ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు షమీ ఆడిన విషయాన్ని గుర్తుచేశాడు. షమీ పట్టుదల, అంకితభావం ఉన్న ఫాస్ట్ బౌలర్ అని, చాలా కష్టపడతాడని మెచ్చుకున్నాడు. ‘షమీ ఆరోజు సరిగా ఆడలేకపోయాడు. ఇలా ఎవరికైనా జరగొచ్చు. కానీ అతని దురదృష్టంకొద్దీ పాకిస్థాన్ మ్యాచ్‌లో అతనికి ఇలా జరిగింది’ అని చెప్పాడు. పాకిస్థాన్ బాగా ఆడి గెలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ ‘వెల్ డన్ పాకిస్థాన్’ అని ఈ విషయాన్ని వదిలేయలేమా? అని గంభీర్ ప్రశ్నించాడు.