ముంబై: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం ముంబైలో షెడ్యూల్‌ను ప్రకటించింది. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరుగబోయే ఈ మెగా టోర్నీకి భారత్‌లో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, ముంబై ఆతిథ్యమివ్వనుండగా శ్రీలంకలో కొలంబో, క్యాండీలో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
20 జట్లు తలపడబోయే ఈ టోర్నీలో జట్లను 4 గ్రూపులుగా విభజించారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించబోయే ఈ టోర్నీలో గ్రూప్, నాకౌట్‌తో కలిపి 55 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8 స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. వాటిలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు వెళ్తాయి. కాగా షెడ్యూల్ విడుదల సందర్భంగా భారత మాజీ సారథి రోహిత్ శర్మను ఐసీసీ.. ఈ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.
ఫిబ్రవరి 7న కొలంబోలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానుంది. గ్రూప్ దశ ఫిబ్రవరి 20 దాకా సాగనుంది. 20 నుంచి మార్చి 01 వరకూ సూపర్-8 దశ జరుగనుండగా 4వ తేదీ నుంచి నాకౌట్ స్టేజ్ మొదలవుతుంది. తొలి సెమీస్ కోల్‌కతా (పాకిస్థాన్ క్వాలిఫై అయితే కొలంబోలో), రెండో సెమీస్ ముంబైలో జరుగుతుంది. మార్చి 8న అహ్మదాబాద్ (పాక్ అర్హత సాధిస్తే కొలంబోలో) ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనుంది.
ఆతిథ్య హక్కులు కల్గిన భారత జట్టు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఫిబ్రవరి 7న టైటిల్ వేటను ప్రారంభించనుంది. గ్రూప్-ఏలో ఉన్న టీమ్ఇండియా..తమ గ్రూపులోనే ఉన్న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 15న అమీతుమీ తేల్చుకోనుంది. దాయాదుల పోరు కొలంబోలో జరుగనుంది. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లన్నీ కొలంబోలోనే జరుగుతాయి.
గ్రూప్-ఏ: భారత్, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏ
గ్రూప్బీ: శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్
గ్రూప్-సీ: ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ
గ్రూప్-డీ: దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, కెనడా, యూఏఈ
ఫిబ్రవరి 07: యూఎస్ఏతో (ముంబై)
ఫిబ్రవరి 12: నమీబియాతో (ఢిల్లీ)
ఫిబ్రవరి 15: పాకిస్థాన్‌తో (కొలంబో)
ఫిబ్రవరి 18: నెదర్లాండ్స్‌తో (అహ్మదాబాద్)