న్యూయార్క్: బ్యాటర్లకు అనుకూలంగా ఉండే పొట్టి ఫార్మాట్లో చాలాకాలం తర్వాత బౌలర్లు ఆధిపత్యం చెలాయించేలా అవకాశం కల్పించిన క్రికెట్ స్టేడియం ఇక చరిత్రలో భాగం కానుంది. టీ20 వరల్డ్‌కప్ కోసం సుమారు రూ. 250 కోట్లతో తాత్కాలికంగా న్యూయార్క్‌లోని ఈస్ట్ మిడో ఏరియాలో 930 ఎకరాల్లో ఉన్న ఐసెన్‌హోవర్ పార్క్‌లో 106 రోజులలోనే నిర్మించిన నసావు క్రికెట్ స్టేడియం కూల్చివేతకు రంగం సిద్ధమైంది.
పొట్టి ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన నసావు.. బౌలర్లకు స్వర్గధామంగా నిలిచింది. అడిలైడ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 10 డ్రాప్ ఇన్ పిచ్‌లతో ఇక్కడ బ్యాటర్లు పరుగుల కోసం తంటాలుపడ్డారు. జూన్ 12న అమెరికాతో భారత్ మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వాహకులు స్టేడియంలో స్టాండ్స్‌ను కూల్చివేసి ఇక్కడి సామాగ్రిని తరలించే పని మొదలుపెట్టారు.
గురువారం స్టేడియం సమీపంలో భారీ బుల్డోజర్లు, క్రేన్లు దర్శనమిచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లాస్ వెగాస్ నుంచి అరువు తీసుకొచ్చిన సామాగ్రి (కుర్చీలు, స్టాండ్స్, విడి భాగాలు) అక్కడ నిర్వహించే గోల్ఫ్ ఈవెంట్‌కు తిరిగి ఇవ్వనున్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది.
34 వేల సామర్థ్యంతో నిర్మించిన ఈ స్టేడియంలో ప్రతిష్టాత్మక భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌లన్నీ అభిమానులను అలరించాయి. ఇప్పటి దాకా భారత్ ఆడిన మ్యాచ్‌లు అన్నీ ఇక్కడే జరిగాయి. వంద పరుగులు ఛేదించడానికి జట్లు నానా తంటాలు పడిన ఈ పిచ్‌పై కెనడా సాధించిన 137 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. నసావు స్టేడియాన్ని కూల్చివేస్తుండటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తూ.. ‘బౌలర్ల అడ్డాగా నువ్వెప్పటికీ గుర్తుంటావు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.