T Natarajan : భారత పేస్ సంచలనం టి.నటరాజన్(T Natarajan)లో ప్రతభకు కొదవ లేదు. ఇప్పటికే జట్టులో కీలక పేసర్‌గా ఎదగాల్సిన నట్టూ ఎక్కడో ఆగిపోయాడు. ఐపీఎల్(IPL) ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిలో పడుతూనే ఉన్నాడు. అయినా సరే టీమిండియా తరఫున అతడు ఆడిన మ్యాచ్‌లను వేళ్ల మీద లెక్కించొచ్చు. నటరాజన్ ఇప్పటివరకూ భారత జెర్సీతో ఒకే ఒక టెస్టు ఆడాడంతే. అది కూడా నాలుగేండ్ల క్రితం. అయితే.. సుదీర్ఘ ఫార్మాట్లో ఆడకపోవడానికి బలమైన కారణం ఉందటున్నాడు ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.
‘నాకు టెస్టు క్రికెట్ ఆడాలనే ఇష్టం లేదని కాదు. నిజానికి నాకు వన్డే, టీ20ల కంటే టెస్టులు అంటేనే ఇష్టం. కానీ, సుదీర్ఘ ఫార్మాట్లో ఎక్కువ సమయం బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతో, నాపై పని భారం పెరుగుతుంది. మోకాళ్ల సంబంధిత సమస్యలు(Knee Issues) కూడా తిరగబెడుతాయి అని నటరాజన్ తెలిపాడు.
యార్కర్లతో వణికించే నటరాజన్ 2021లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బ్రిస్బేన్ స్టేడియం(Brisbane Stadium)లో తొలి ఇన్నింగ్స్‌లో అతడు 3/78తో మెప్పించాడు. అయితే.. ఆ తర్వాత గాయాల కారణంగా మళ్లీ నటరాజన్ వైట్ జెర్సీలో కనిపించలేదు.
ఇక వన్డేల్లో, టీ20ల్లో సైతం పోటీ పెరగడంతో నటరాజన్‌కు అవకాశాలు తక్కువే వచ్చాయి. 2021 మార్చి 28వ తేదీన ఇంగ్లండ్‌పై ఈ స్పీడ్‌స్టర్ ఆఖరి వన్డే ఆడేశాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన నటరాజన్ ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చాడు. పదునైన యార్కర్లతో బ్యాటర్లను బోల్తా కొట్టించి నట్టూగా పాపులర్ అయిన ఈ స్పీడ్‌స్టర్ 2021లో టీ20లకు ఎంపికయ్యాడు.
కానీ, ఆశ్చర్యకరంగా ఒక టెస్టు, రెండు వన్డేలు, నాలుగు టీ20లు.. కలిపి మ్యాచ్‌లు ఆడాడంతే. ఆ తర్వాత ఐపీఎల్‌కే పరిమితం అయ్యాడు. కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్( sunrisers hyderabad) ప్రధాన పేసర్‌గా నటరాజన్ కొనసాగుతున్నాడు. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆరెంజ్ ఆర్మీ 17వ సీజన్లో ఫైనల్ చేరడంలో నట్టూ పాత్ర మరువలేనిది. సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించిన నటరాజన్ 14 మ్యాచుల్లో 19 వికెట్లు పడగొట్టాడు.