మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పోలండ్ భామ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగిస్తోంది. ప్రత్యర్థికి ఒక్క సెట్ కాదు కదా.. కనీసం ఒక్క గేమ్ కూడా గెలవనీయకుండా ఆడుతున్న ఆమె ప్రిక్వార్టర్స్‌లోనూ అదే దూకుడును ప్రదర్శించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ స్వియాటెక్ 6-0, 6-1తో ఎవా లిస్ (జర్మనీ)ని మట్టికరిపించింది.
59 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించిన ఈ పోలండ్ ప్లేయర్.. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేసి మ్యాచ్‌లను సొంతం చేసుకోవడం విశేషం. గత రెండు మ్యాచ్‌లలోనూ ఆమె రదుకాను, స్రమ్కోవాలపైనా 6-0తేడాతో సెట్లను గెలుచుకున్న విషయం విదితమే. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ ఎలీనా రిబాకినా(కజకిస్థాన్).. 3-6, 6-1, 3-6తో మాడిసన్ (యూఎస్) చేతిలో ఓడింది. స్వితోలినా, నవర్రో క్వార్టర్స్ చేరారు.
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిన్నర్ క్వార్టర్స్ చేరాడు. నాలుగో రౌండ్లో ఈ ఇటలీ కుర్రాడు 6-3, 3-6, 6-3, 6-2తో హోల్గర్ రూణె (డెన్మార్క్)తో పోరాడి గెలిచాడు. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన మ్యాచ్‌లో రెండో గేమ్ గెలిచినప్పటికీ రూణె ఆ జోరు కొనసాగించక చతికిలపడ్డాడు. 8వ సీడ్ అలెక్స్ డి మినార్, బెన్ షెల్టన్, లొరెంజొ సొనెగొ క్వార్టర్స్‌కు అర్హత సాధించారు.