విశ్వక్రీడలు మొదలై వారం రోజులు కావొస్తున్నా పలు క్రీడాంశాల్లో ఒడిదొడుకుల మధ్య సాగుతున్న భారత అథ్లెట్ల ప్రయాణానికి భిన్నంగా షూటర్లు సత్తా చాటుతున్నారు. బరిలో దిగితే పతకం పక్కా అనే రేంజ్లో రెచ్చిపోతున్నారు. పారిస్‌లో మన ‘పిస్టల్ వీరులు’ ఇది వరకే రెండు సార్లు కంచు మోత మోగించగా గురువారం మరో యువ షూటర్ స్వప్నిల్ కుసాలె సైతం గురితప్పని లక్ష్యంతో కాంస్య పతకాన్ని పట్టుకొచ్చాడు.
పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి దేశానికి ముచ్చటగా మూడో పతకాన్ని అందించడమే గాక ఈ ఈవెంట్లో పతకం నెగ్గిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఐదు రోజుల వ్యవధిలోనే మను భాకర్, సరభ్‌జ్యోత్ సింగ్, స్వప్నిల్..షూటింగ్లో మూడు పతకాలు అందించడం గమనార్హం.
Paris Olympics | పారిస్: ఒలింపిక్స్‌లో భారత తుపాకీ మరోసారి గురితప్పని బుల్లెట్‌తో సత్తాచాటింది. ఐదు రోజులుగా జరుగుతున్న షూటింగ్ ఈవెంట్స్‌లో చెక్కుచెదరని లక్ష్యాలతో దేశానికి ఇది వరకే రెండు కాంస్యాలను అందించిన మన షూటర్లు విశ్వక్రీడా యవనికపై మువ్వన్నెల పతకాన్ని మరోసారి రెపరెపలాడించారు. గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ (త్రీ పీ)లో భారత యువ షూటర్ స్వప్నిల్ కుసాలె కాంస్య పతకం గెలుచుకుని దేశ క్రీడాభిమానుల ఆనందాన్ని ‘మూడింతలు’ చేశాడు.
క్వాలిఫికేషన్ రౌండ్లో ఏడో స్థానంలో నిలిచి ఎనిమిది మంది అర్హత సాధించిన ఫైనల్లో 451.4 పాయింట్లు స్కోరు చేసిన అతడు దేశానికి మరోసారి కంచు మోత మోగించాడు. తద్వారా ఐదు రోజుల వ్యవధిలోనే భారత్‌కు షూటింగ్‌లోనే మను భాకర్, సరభ్‌జ్యోత్ సింగ్ తర్వాత 3వ పతకం అందించిన మూడో షూటర్‌గా నిలిచాడు. ఇదే ఈవెంట్లో చైనా షూటర్ యుకున్ లియు (463.6) స్వర్ణం గెలుచుకోగా ఉక్రెయిన్‌కు చెందిన సెర్హియ్ కులిష్ (461.3) రజతం నెగ్గాడు.
మూడు విధాలుగా (స్టాండింగ్, నీలింగ్, ప్రోన్) జరిగే ఈ ఈవెంట్ ఫైనల్ పోరును స్వప్నిల్ నెమ్మదిగానే మొదలుపెట్టాడు. మోకాళ్ల మీద కూర్చునే (నీలింగ్) విభాగంలో మూడు సిరీస్‌లలోనూ స్వప్నిల్ 50.8, 50.9, 51.6తో మొత్తంగా 153.3 పాయింట్లు సాధించి ఈ రౌండ్ అయిపోయేసరికి ఆరో స్థానంలో నిలిచాడు. కానీ బోర్లా పడుకుని (ప్రోన్) షూట్ చేసే విభాగంలో స్కోరును మెరుగుపర్చుకున్నాడు. మూడు సిరీస్‌లలో 52.7, 52.2, 51.9 (156.8) స్కోరు చేసి ఓవరాల్‌గా 310.1 పాయింట్లు సాధించాడు. ఇక చివరిదైన స్టాండింగ్ పొజిషన్లో (రెండు సిరీస్‌లు మాత్రమే) 51.1, 50.4తో ఓవరాల్‌గా 411.6 పాయింట్లు రాబట్టి ఆరో స్థానానికే పరిమితమయ్యాడు. 40వ షాట్ తర్వాత ఎలిమినేషన్ రౌండ్ మొదలవగా తర్వాత వరుసగా నాలుగు షాట్లలో 10.5, 9.4, 9.9, 10.0 స్కోరుతో తన ప్రత్యర్థులను చిత్తు చేసి మూడో స్థానంతో ముగించాడు.
ఒలింపిక్స్‌లో మునుపెన్నడూ లేని విధంగా మన షూటర్లు గురి తప్పని లక్ష్యాలతో పతకాల పంట పండిస్తున్నారు. ఈ క్రీడలో పుష్కరకాలం (చివరిసారిగా 2012లో)గా ఉన్న పతక కరువును తనివితీరా తీర్చుతున్నారు. 2016, 2020లో రిక్తహస్తాలతో తిరిగొచ్చిన మన షూటర్లు పారిస్‌లో మాత్రం ‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా!’ అన్నట్టుగా బరిలోకి దిగితే గురి పతకానికే అనే రేంజ్లో రెచ్చిపోతున్నారు.
దేశానికి పతక బోణీ కొట్టిన యువ సంచలనం మను భాకర్ ఇచ్చిన స్ఫూర్తితో మిగతా షూటర్లు అంచనాలను మించి రాణిస్తున్నారు. ఆమెతో కలిసి సరభ్‌జ్యోత్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో కాంస్యాన్ని నెగ్గగా తాజాగా స్వప్నిల్ సైతం పతక గురితప్పలేదు. ఈ రెండు ఈవెంట్స్‌లో భారత్ తొలిసారిగా మెడల్స్ నెగ్గడం విశేషం. మనుపై అంచనాలున్నా సరభ్‌జ్యోత్, స్వప్నిల్ మాత్రం సర్ప్రైజ్ ప్యాకేజీలే. త్రుటిలో గురి తప్పింది గానీ మెన్స్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబుతా కూడా పతకాన్ని పట్టుకొచ్చేవాడే. నాలుగో స్థానంలో నిలిచినా అతడి ప్రదర్శనను కొట్టిపారేయలేం.
రమితా జిందాల్ సైతం అంచనాలకు మించి రాణించింది. రికార్డు స్థాయిలో ఈసారి 21 మంది తో పారిస్ బరిలో నిలిచిన భారత్.. టోక్యో వైఫల్యాలను మరిచిపోయి విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఆత్మవిశ్వాసంతో పోటీలో నిలుస్తున్న షూటర్లు.. మొక్కవోని ఏకాగ్రత, చెక్కుచెదరని లక్ష్య సాధనతో పది పాయింట్ల వృత్తంలోకి గురిపెడుతూ పతకాలు పట్టుకొస్తున్నారు. ఇప్పటికే మూడు పతకాలు వచ్చిన షూటింగ్లో మనుతో పాటు హైదరాబాదీ యువ షూటర్ ఇషా సింగ్ పోటీలో ఉన్న మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ భారత్ పతకాలు ఆశిస్తోంది. శుక్రవారం జరిగే ఈ ఈవెంట్లో మనుభాకర్, ఇషాసింగ్ పోటీపడనున్నారు.
‘పారిస్’లో దేశానికి మూడో పతకం అందించిన స్వప్నిల్ది సాధారణ మధ్యతరగతి కుటుంబం. 1995 ఆగస్టు 6న పూణెకు సమీపంలో ఉన్న కొల్హాపూర్ జిల్లా రత్నగిరి తాలూకా కంబల్వడి గ్రామంలో అతడు జన్మించాడు. స్వప్నిల్ తల్లి అనిత ప్రస్తుతం ఆ గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వర్తిస్తోంది. పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామంతో పాటు ‘సంపూర్ణ మధ్యనిషేదం’ అమలులో ఉన్న గ్రామంగా ఆ ఊరుకు దేశవ్యాప్తంగా పేరుంది. స్వప్నిల్ తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు.
స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన స్వప్నిల్‌ను అతడి తండ్రి 14వ ఏట మహారాష్ట్ర క్రీడా పతకం అయిన ‘క్రీడా ప్రభోధిని’లో చేర్పించి శిక్షణ ఇప్పించాడు. ఏడాది శిక్షణ అనంతరం స్వప్నిల్ షూటింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. 2015లో ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ (జూనియర్ స్థాయిలో) స్వర్ణం నెగ్గిన అతడు 59వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్)లో ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో భారత బృందానికి ‘చెఫ్ డి మిషన్’గా ఉన్న గగన్ నారంగ్‌ను ఓడించాడు. 2012 నుంచి అంతర్జాతీయ టోర్నీలలో పోటీ పడుతున్నా 12 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేశాడు.
భారత క్రికెట్ అభిమానులు ‘మిస్టర్ కూల్’ అని పిలుచుకునే ధోనీకి స్వప్నిల్ వీరాభిమాని. ధోనీ మాదిరిగానే అతడు కూడా రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న షూటింగ్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రశాంతంగా ఉండటం అత్యంత కీలకమని క్రికెట్లో ధోనీ నుంచి తాను అది నేర్చుకున్నానని అంటున్నాడీ కుర్రాడు.
‘నేను షూటింగ్లో పెద్దగా ఎవరినీ ఆరాధించను. కానీ నాకు ధోనీ అంటే అభిమానం. నా ఆటలో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. నేను దానిని ధోనీ నుంచే నేర్చుకున్నా. అంతేగాక నేను కూడా అతడి మాదిరిగానే రైల్వేలో టికెట్ కలెక్టర్‌ను’ అని తెలిపాడు. స్వప్నిల్ 2015 నుంచి పూణె రైల్వే డివిజన్లో టీటీఈగా పనిచేస్తున్నాడు.