ఢిల్లీ: గత కొంతకాలంగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న టీమ్ఇండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా అతడే తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. పొత్తికడుపులో కుడివైపున స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న అతడు.. జర్మనీలోని మునిచ్‌లో సర్జరీ చేయించుకున్నట్టు తెలిపాడు.
‘లైఫ్ అప్డేట్: పొత్తికడుపులో కుడివైపున స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ విజయవంతమైంది. ప్రస్తుతానికైతే వేగంగా కోలుకుంటున్నాను. మళ్లీ మైదానంలో అడుగుపెట్టే రోజు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. గడిచిన రెండున్నరేండ్ల కాలంలో సూర్యకు ఇది మూడో సర్జరీ కావడం గమనార్హం. జర్మనీ నుంచి తిరిగిరాగానే సూర్య.. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందనున్నాడు.