దుబాయ్: ఆసియాకప్(Asia Cup) టోర్నీ నేటి నుంచి ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆరు జట్లకు చెందిన కెప్టెన్లతో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఓ జర్నలిస్టు టోర్నమెంట్ ఫెవరేట్ ఎవరన్న ప్రశ్న వేశారు. ఆసియా కప్ టోర్నీ టైటిల్‌కు ఇండియా ఫెవరేట్‌గా ఉందన్న విషయం నిజమేనా అని ఆయన ప్రశ్న వేశారు. దానికి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా స్పందించారు. అయితే సూర్య తన సమాధానంతో అందర్నీ స్టన్ చేశాడు. కిస్నే బోలా.. మీకెవరు చెప్పారు.. నేనెప్పుడు వినలేదని అన్నాడు. నాలుగు రోజుల క్రితమే దుబాయ్‌కు చేరుకున్నామని, టోర్నీ గెలవాలన్న కాన్ఫిడెంట్‌తో ఉన్నామని, జట్టుకు మంచి గుర్తింపు వచ్చిందని, టోర్నీలో రాణించనున్నట్లు అతను చెప్పాడు.
ఫెవరేట్స్ ఎవరన్న ప్రశ్నకు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా స్పందించారు. టీ20 క్రికెట్లో ఏ జట్టు కూడా ఫెవరేట్‌గా ఉండదన్నారు. ఎందుకంటే ఆట విధానమే అలా ఉంటుందన్నారు. ఇది ఫాస్ట్ పేస్ గేమ్ అని, కొన్ని ఓవర్లలో మ్యాచ్ స్వరూపం మారిపోతుందని సల్మాన్ అన్నాడు. యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్‌తో ఇటీవల జరిగిన ట్రై సిరీస్‌లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఆసియాకప్‌ను గెలవకుంటే, ట్రై సిరీస్ గెలిచి లాభం లేదని సల్మాన్ తెలిపాడు.
ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో ఇండియా, పాక్ కెప్టెన్లు హ్యాండ్‌షేక్ ఇచ్చుకోలేదు.